జనగామ రూరల్: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్ తయారీపై సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో ప్రధానంగా సీడ్ బాల్స్ తయారీ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో వాటి ప్రాముఖ్యంపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ కె.శ్రీనివాస్, డి.లక్ష్మి అనురాధ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జోరుగా బెట్టింగులు
జనగామ: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ క్రికెట్ అభిమానులను అలరించగా.. బెట్టింగులు జోరుగా నడిచాయి. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి న్యూజిలాండ్–ఇండియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌పై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు సాగినట్లు సమాచారం. ఈ బెట్టింగ్ వ్యవహారం ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నడిచినట్లు సమాచారం. అక్కడి నుంచి పలువురు ఏజెంట్లు వివిధ ప్రాంతాల్లో బ్రోకర్లను నియమించుకొని మొత్తం వ్యవహారాన్ని ఫోన్ల ద్వారా నిర్వహించినట్లు తెలిసింది. రూ.1000 నుంచి మొదలుకుని రూ.లక్షకు పైగా బెట్టింగ్‌లకు పాల్పడ్డారని సమాచారం. బెట్టింగ్‌లను ఫోన్ల ద్వారా నడిపించగా, నగదు విషయంలో అత్యంత గోప్యంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. ఇందులో కొంతమంది బెట్టింగ్‌లకు పాల్పడి పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకున్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది.
ప్రిస్క్రిప్షన్ ఉంటేనే
మందులు విక్రయించాలి
ఎంజీఎం: రిటైల్ మందుల వ్యాపారులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే మందులు విక్రయించాలని డ్రగ్ కంట్రోల్ శాఖ వరంగల్ ఏడీ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి సూచించారు. సరైన డ్రగ్ లైసెన్స్ ఉన్న రిటైల్ సంస్థలకు హోల్‌సేల్ వ్యాపారులు విక్రయించాలని పేర్కొన్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ మందులను విక్రయించరాదని వివరించారు. ఏదైనా మెడికల్ షాపు ఆర్‌ఎంపీలకు మందులు విక్రయిస్తే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గ్యాస్ ధర తగ్గించాలని కేంద్రం దిష్టిబొమ్మ దహనం
జనగామ రూరల్: పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జనగామ చౌరస్తాలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సుంచు విజేందర్, ఎండీ అజారుద్దీన్, బాల్నె వెంకట మల్లయ్య, బూడిది ప్రశాంత్, శాఖా కార్యదర్శులు సురేశ్, అబ్రహం లింకన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ మార్కెట్‌కు భారీగా మిర్చి రాక
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు ఈసీజన్‌లో మొదటిసారిగా 50 వేల వరకు మిర్చి బస్తాలు విక్రయించేందుకు రైతులు యార్డుకు తీసుకొచ్చారు. శనివారం యార్డు బంద్, ఆదివారం వారాంతపు బంద్ కావడంతో సోమవారం భారీగా మిర్చిని తీసుకొచ్చారు. తేజ, యూఎస్–341 రకానికి చెందిన మిర్చిని రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చారు. ఇందులో క్వింటా మిర్చి తేజ రకానికి గరిష్టంగా రూ.19,500, యూఎస్–341కు రూ.21,600, వండర్ హాట్‌కు రూ.35,000, దేశీ రకానికి రూ.42 వేలు, ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.


