పోస్టింగ్‌ కోసం పోటాపోటీ! | - | Sakshi
Sakshi News home page

పోస్టింగ్‌ కోసం పోటాపోటీ!

Mar 9 2026 7:30 AM | Updated on Mar 9 2026 7:30 AM

వరంగల్‌ కమిషనరేట్‌లో సీఐల పైరవీలు బదిలీల ప్రచారం.. పైరవీల కలకలం

వరంగల్‌ కమిషనరేట్‌లో సీఐల పైరవీలు
బదిలీల ప్రచారం.. పైరవీల కలకలం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీస్‌ అధికారుల మధ్య పోస్టింగ్‌ల కోసం పోటీ జోరందుకున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్‌ వరంగల్‌ నగర పరిధి కీలక పోలీస్‌స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓల కోసం ఇన్‌స్పెక్టర్లు కొందరు ఎడాపెడా పైరవీలు చేస్తున్నారన్న ప్రచారం పోలీస్‌వర్గాల్లో సాగుతోంది. ‘గ్రేటర్‌’ పరిధి కొన్ని పోలీస్‌స్టేషన్లే ఇప్పుడు ‘హాట్‌ ఠాణా’లుగా మారాయి. ఆ ఠాణాల్లో ఎస్‌హెచ్‌ఓలుగా చేరి సుమారు ఏడాదిన్నర కావొస్తుండగా.. ఇటీవల మారిన పోలీస్‌స్టేషన్ల కోసం కూడా సిట్టింగ్‌ ఎస్‌హెచ్‌ఓలే పైరవీలు చేసుకుంటుండడం చర్చనీయాంశం అవుతోంది. కొందరు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పటికే కొందరు లేఖలు పొందినట్లు చెబుతున్నారు. అయితే, లేఖలు పొందిన కొందరికీ పోలీసు ఉన్నతాధికారులు ‘నో’ చెప్పడంతో బదిలీ తప్పదని తెలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ ఠాణాలపైనే అందరి గురి..

గ్రేటర్‌ పరిధిలోని 12 పోలీస్‌స్టేషన్లపై ఆశావహులు కన్నేసినట్లు పోలీసుశాఖలో ప్రచారం ఉంది. వ్యాపారం, రియల్‌ ఎస్టేట్‌, ట్రాఫిక్‌, రాజకీయ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో ‘ప్రాధాన్యత పోస్టింగ్స్‌’గా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే పోస్టింగ్‌ల కోసం పోటాపోటీగా పైరవీలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ ఠాణాల్లో పోస్టింగ్‌ కోసం సీఐలు రాజకీయ నాయకుల ద్వారా, మరికొందరు సీనియర్‌ అధికారుల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నట్లు చెబుతుండగా.. ఇంకొందరు ఈ రెండు రకాల ప్రయత్నాలతో ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రధానంగా గ్రేటర్‌ పరిధిలో హనుమకొండ, కాజీపేట, కేయూసీ, మడికొండ, సుబేదారి, మట్టెవాడ, వరంగల్‌ మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్‌, మట్టెవాడ, ధర్మసాగర్‌, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్‌, పరకాల, ఆత్మకూరు, మామునూరు పోలీస్‌స్టేషన్లు కీలకమైనవిగా చర్చ ఉంది. బదిలీల చర్చ మొదలైతే చాలు ఈ ఠాణా కుర్చీలపై ‘ఖర్చీఫ్‌’ వేసుకునేందుకు పోటీపడతారు. అయితే, సుబేదారి, ధర్మసాగర్‌, హసన్‌పర్తి, మట్టెవాడ.. మరో రెండు స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు కొత్తగా చేరి ఐదారు మాసాలు అవుతుండగా.. ఏడాది నుంచి ఏడాదిన్నర దాటిన పోలీస్‌స్టేషన్లకు పోస్టింగుల్లో ఉన్నవారితోపాటు లూప్‌లైన్లలో ఉన్న సీఐల పోటాపోటీ పైరవీలు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారుతోంది.

కాసులు కురిపించే ఠాణాలపై అందరి గురి

ఏడాదిన్నర పూర్తయిన స్టేషన్లపై కన్ను

ప్రజాప్రతినిధుల లేఖలతో సీట్లపై ఖర్చీఫ్‌లు

కొందరు సీఐలపై ఉన్నతాధికారుల సీరియస్‌

త్వరలో పలువురు ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం

కమిషనరేట్‌ పరిధిలో పలువురు సీఐల బదిలీలు అనివార్యమన్న ప్రచారం నేపథ్యంలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరు పొలిటికల్‌ ప్రెషర్‌ తట్టుకోలేక బదిలీల ప్రయత్నాల్లో ఉండగా.. ఆ పోస్టింగ్‌లో ఖర్చీఫ్‌ వేసేందుకు కీలక ప్రజాప్రతినిధుల లేఖలు తీసుకుంటున్నారు. అయితే, ఈ లేఖల్లో చాలా వరకు పోలీసు ఉన్నతాధికారుల మద్దతు దక్కడం లేదని తెలుస్తోంది. వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని ఓ సీఐపై వచ్చిన ఆరోపణలు, పనితీరుపై ఉన్నతాధికారి ఒకరు ఇటీవలే సీరియస్‌ అయ్యారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్థానం కోసం వీఆర్‌లో ఉన్న ఓ సీఐ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, అదే డివిజన్‌కు చెందిన ఓ పోలీస్‌స్టేషన్‌కు నిఘా విభాగంలోని ఓ సీఐ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అక్కడున్న ఎస్‌హెచ్‌ఓ నర్సంపేట్‌ సబ్‌డివిజన్‌కు లెటర్‌ తీసుకుంటే ఉన్నతాధికారులు అంగీకరించలేదన్న సమాచారం. కాగా, త్వరలోనే సీఐల బదిలీలు ఉంటాయన్న చర్చ కొద్ది రోజులుగా సాగుతుండగా.. కేయూసీ, ఎల్కతుర్తి, మడికొండ, ఇంతేజార్‌గంజ్‌, పరకాల, ఆత్మకూరు, వర్ధన్నపేట తదితర ఠాణాలకు ఆశావహులు పెరుగుతుండడం పోలీస్‌వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే పోస్టింగ్‌లు, బదిలీలపై జరుగుతున్న ఈ ప్రచారంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోగా.. పోస్టింగ్‌ల కోసం జరుగుతున్న ఈ పైరవీలపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement