రూ.96లక్షల భారం
● పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు
● జిల్లాలో 1.60లక్షల సిలిండర్లు
● పేద కుటుంబాల బడ్జెట్ తలకిందులు
జనగామ: పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు పెరుగుతుండడంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. గృహ వినియోగదారులకు అందించే సబ్సిడీ సిలిండర్‌తో పాటు కమర్షియల్ సిలిండర్లపై కూడా ధరలు పెరగడంతో సామాన్యులు, పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.
పెరిగిన ధరలు
గృహ వినియోగానికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్‌పై రూ.60 పెంపు ప్రకటించారు. దీంతో మొన్నటి వరకు రూ.907.50 పైసలుగా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.967.50 పైసలకు చేరింది. అదే విధంగా హోటళ్లు, వ్యాపార సంస్థలు వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. ముందుగా రూ.1,997గా ఉన్న కమర్షియల్ సిలిండర్‌పై రూ.114 పెంచడంతో ప్రస్తుతం అది రూ.2,111కు చేరింది.
1.60లక్షల కనెక్షన్లు
జిల్లాలో భారత్ గ్యాస్, ఐఓసీఎల్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలకు చెందిన 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, గృహ వినియోగ సబ్సిడీ సిలిండర్లు సుమారు 1,60 లక్షలు ఉన్నాయి. అదే విధంగా కమర్షియల్ వినియోగానికి సంబంధించిన సిలిండర్లు సుమారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఉన్నట్లు గ్యాస్ ఏజెన్సీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సబ్సిడీ సిలిండర్లలో వివిధ పథకాల కింద పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. సీఎస్‌ఆర్ కేటగిరీలో 14,570 సిలిండర్లు, దీపం పథకంలో 41,222, ఉజ్వల పథకం ద్వారా 18,070 మందికి గ్యాస్ కనెక్షన్లు అందించగా, జనరల్ కేటగిరీలో 86,154 సిలిండర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 1,86,294 ఉండగా, వాటిలో సభ్యులు సుమారు 5,62,221 మంది ఉన్నారు.
అన్ని వర్గాల ప్రజలు అత్యధికంగా గ్యాస్ సిలిండర్లను వంటకు ఉపయోగిస్తుండడంతో ధరల పెంపు నేరుగా కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధన ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల పేద కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో నెలవారీ ఖర్చులు పెరిగి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సబ్సిడీ సిలిండర్లు 1.60లక్షలు ఉండగా, పెరిగిన రూ.60తో రూ.96లక్షలు, కమర్షియల్‌పై రూ.9.12లక్షల మేర భారం పడుతుంది. సబ్సిడీ సిలిండర్లపై ప్రభుత్వం రూ.40 మాత్రమే అందిస్తుండగా, ఉజ్వల సిలిండర్లకు మాత్రం రూ.300 మేర వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు.


