జనగామ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ ఆర్టీసీ డిపోలో ఆదివారం మేనేజర్ ఎస్.స్వాతి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను హాజరై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు మహిళా ఉద్యోగులను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో డిపో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంఘటిత
పోరాటాలతోనే రక్షణ
జనగామ రూరల్: సంఘటిత పోరాటాలతోనే మహిళలు హక్కులకు రక్షణ కలుగుతుందని, సమానత్వం కోసం ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కేఎన్ ఆశాలత అన్నారు. ఆదివారం ప్రజాసంఘాల కార్యాలయంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఈర్రి అహల్య అధ్యక్షత ఐద్వా, సీఐటీయూ, రైతుసంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆశాలత మాట్లాడుతూ.. దేశ జనాభాలో 48 శాతంగా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, భద్రతలో మహిళా వివక్ష స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు సుంచు విజేందర్, చందు నాయక్, 3వ వార్డు కౌన్సలర్ బూడిద జ్యోతి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండీ షాబాన, పొదల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ లైన్లకు యూనిక్ పోల్ నంబర్లు
జనగామ: జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ ప్రక్రియలో భాగంగా జనగామ సర్కిల్ పరిధిలోని 33 కేవీ లైన్ పరిధిలో ఉన్న 44 ఫీడర్ల పనులను పూర్తి చేసినట్లు జనగామ సర్కిల్ సూపరింటెండింగ్(ఎన్‌పీడీఎల్) ఇంజనీర్ సంపత్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఈ ఆదివారం మాట్లాడుతూ.. 11 కేవీ లైన్లలోని 363 ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్ పెయింటింగ్ పనులను కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అమలు చేయడం ద్వారా ప్రతి పోల్ ఆధారంగా లైన్లకు పెట్రోలింగ్ నిర్వహించడం సులభమవుతుందని ఆయన తెలిపారు. అలాగే నిర్వహణ పనులను సమర్థవంతంగా ట్రాక్ చేసుకునే అవకాశం కూడా కలుగుతుందని చెప్పారు. గతంలో జరిగిన విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ వైఫల్యాలు వంటి వివరాలను కూడా సులభంగా గుర్తించి ట్రాక్ చేయడానికి ఈ వ్యవస్థ సహాయపడుతుందని వివరించారు.


