● 30 వార్డుల్లో 18 మంది ప్రాతినిథ్యం
● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
జనగామ: జనగామ మున్సిపాలిటీలో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగా పెరిగింది. 30 వార్డులు ఉండగా అందులో 18 మంది మహిళా కౌన్సిలర్లు ఎన్నికై సుమారు 60 శాతం ప్రాతినిథ్యాన్ని సాధించారు. మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ స్థానాలతో పాటు జనరల్, బీసీ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసి విజయం సాధించడం విశేషం. దీంతో మున్సిపాలిటీ పాలనలో మహిళల పాత్ర మరింత బలపడింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో మహిళా కౌన్సిలర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగామ మున్సిపాలిటీలో మహిళల అధిక ప్రాతినిథ్యం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది. నేడు (ఆదివారం) వారంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.
మినిమం పే స్కేల్ వర్తింపజేయాలి..
జనగామ రూరల్: కేజీబీవీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ స్కేల్లో మినిమం పే వర్తింపజేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ షరీఫ్ ఇప్ప రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బి.చొక్కయ్య, టి.శ్రీనివాసులు, బి.శివరాం, ఎం.యాదయ్య, ఎన్.దూడయ్య, కె.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


