
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జనగామ: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ హాల్‌లో భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలతో శిథిలావస్థకు చేరి, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాల నుంచి ఆయా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలన్నారు. వాగులు, కల్వర్టుల వద్ద వరద పోటెత్తిన సమయంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే వారు అటువైపు రాకుండా నియంత్రించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలన్నారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి జ్వరాలు రాకుండా ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. అత్యవసర సమయంలో ప్రజలు 9052308621 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ గోపి రామ్, డిప్యూటీ కలెక్టర్లు కొమురయ్య, సుహసిని, డీఆర్డీఓ పీడీ వసంత, డీపీఓ స్వరూప, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
యూరియా కొరత లేదు..
జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. యూరియా, ఎరువుల లభ్యతపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం కలెక్టర్లతో హైదరాబార్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. అక్కడ నుంచి డీసీపీ రాజమహేంద్రనాయక్, డీఏఓ కె.అంబికాసోనీతో కలిసి పట్టణంలోని పలు ఎరువులు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 1273.935 మెట్రిక్ టన్నుల యూరియా, 245.65 మెట్రిక్ టన్నుల డీఏపీ మార్క్‌ఫెడ్ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఒకే దుకాణం వద్ద రద్దీ లేకుండా, వేర్వేరుగా కొనుగోలు చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. యూరి యా కొనుగోలులో సమస్యలు ఉత్పన్నమైతే 8977 745512 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా