
రోడ్డుపై నిలిచిన నీరే..గొంతు తడిపింది..
జనగామ: దాహంతో అలమటిస్తున్న ఓ అనాథ.. రోడ్డుపై నిలిచి ఉన్న నీటితో గొంతు తడుపుకున్నాడు. జీవులు చివరకు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రోడ్డుపై నిలిచే వరద, మురికి నీటితో గొంతు తడుపుకునే దృశ్యం ప్రతీఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. వరద నీటితో దాహం తీర్చుకునే పరిస్థితి, సమాజం సిగ్గుపడేలా చేస్తుంది. మనిషి ప్రాథమిక హక్కు కరువైన సమయంలో మిగిలేది మురికి నీరు అనే సామెత నిజమైంది. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన ఓ నిరాశ్రయుడు రోడ్డుపై నిలిచిన కలుషితమైన వర్షం నీటితో గొంతు తడుపుకునే దృశ్యం కన్నీళ్లు పెట్టించిన సంఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్, కొయ్యడ రవి, ముఖ్య సలహాదారులు వంగ భీమ్ రాజు అనాథను తీసుకు వెళ్లి, మినరల్ వాటర్‌తో దాహం తీర్చారు. పట్టణంలో అనాథల ఆకలి, దాహం తీర్చేందుకు ప్రత్యేక క్యాంటిన్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషాకు విజ్ఞప్తి చేశారు.