
గర్జిస్తున్న గ్రామసింహాలు
పొలం వద్దకు వెళ్లి వస్తుండగా..
ఈఫొటోలోని వ్యక్తి జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రైతు బత్తిని హరీష్. జూలై 29న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లొస్తుండగా.. ఎస్సీ కాలనీ వద్ద కుక్కల గుంపు ఒక్కసారిగా విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో హరీష్ శరీరంపై నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. కూనూరు పీహెచ్‌సీకి వెళ్లి యాంటీ డోస్‌లు తీసుకున్నారు.
చిన్నారిపై దాడి
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు మైదం సిరితన్విక. రెండు రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో పిచ్చి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.
జనగామ: జనగామ పట్టణం కుక్కలకు అడ్డాగా మారిపోయిందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ప్రతి వీధిలో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు మనిషి కనిపిస్తేచాలు గుర్రుమంటూ భయపెడుతున్నాయి. కాలనీలోకి కొత్తవ్యక్తులు వస్తే మొరుగుతూ స్థానికులను అప్రమత్తం చేసే ఈ కుక్కలే రోడ్లపై చెత్త డంపుల్లో వేసే మటన్, చికెన్, ఇతర ప్రమాదకర వ్యర్థాలను తింటూ క్రూరంగా మారుతున్నాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు కుక్క కాటుకుతో ఆస్పత్రికి పరుగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఎక్కడ చూసినా కుక్కలే..
పట్టణాలు, మండలాలు, గ్రామాలు ఇలా ఎక్కడ చూసినా కుక్కలు బెడద తప్పడంలేదు. ఏదోచోట రోజుకు ఒకరిద్దరైనా కుక్కకాటుకు గురవుతున్న పరిస్థితి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వారి పాలిట కుక్కలు ప్రాణసంకటంగా మారాయి. ఢిల్లీ ఘటనపై సుప్రీంకోర్టు స్పందిస్తూ వీధి కుక్కల నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి విధితమే. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వీధి కుక్కల సంతతి రోజు రోజుకూ పెరుగుతుంది. నియంత్రణకు సంబంధించి పురపాలిక, పంచాయతీ శాఖ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. కుక్క కాటుకు గురైన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే జంతు ప్రేమికులు మాత్రం కుక్కలను చంపడం పరిష్కారం కాదని, శాసీ్త్రయ పద్ధతుల్లో సమస్యను ఎదుర్కోవాలని సూచిస్తుండడం గమనార్హం.
ఎలా అరికట్టాలి..
పట్టణాల్లో రాత్రిపూట కుక్కల సంచారాన్ని అరికడితే కొంతమేర దాడులను నియంత్రించవచ్చు. పట్టణంలోని బాలాజీనగర్, శ్రీనగర్ కాలనీ, అంబేడ్కర్ నగర్, రైల్వేస్టేషన్, కుర్మవాడ, ధర్మకంచ, గ్రేయన్ మార్కెట్, వీవర్స్‌కాలనీ, గిర్నిగడ్డ, గుండ్లగడ్డ, ఆర్టీసీ చౌరస్తా, సిద్దిపేటరోడ్డు, నెహ్రూపార్కు తదితర ప్రాంతాల్లో వందలాది కుక్కలు సంచరిస్తూ దడ పుట్టిస్తున్నాయి. పురపాలిక పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు చెత్త డంపులను తొలగించి, శానిటేషన్ నిర్వహిస్తే గుంపులుగా వచ్చే కుక్కల సంతతి తగ్గిపోతుంది. కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సల్లో వేగం పెంచాలి.
భయపెడుతున్న కుక్కలు
విచక్షణారహితంగా దాడులు
రోడ్డుపైకి రావాలంటేనే జంకుతున్న జనం
ప్రేక్షక పాత్రలో మున్సిపల్ అధికారులు

గర్జిస్తున్న గ్రామసింహాలు

గర్జిస్తున్న గ్రామసింహాలు

గర్జిస్తున్న గ్రామసింహాలు