
పెంపునకే సర్కారు మొగ్గు!
● మరోసారి గడువు పెంచనున్న ప్రభుత్వం
● స్థానిక సంస్థల ఎన్నికల
నేపఽథ్యంతో నిర్ణయం
● జిల్లాలో 14 సొసైటీల్లో
87,210 మంది రైతులు
జనగామ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక మండలి పొడగింపు గడువు నేటి (గురువారం)తో ముగియనుంది. ప్రత్యక్ష ఎలక్షన్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సొసైటీ సంఘాలు.. ఐదేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత మరో ఆరు నెలల పాటు అధికార బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచి పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ఆరు నెలల పదవీ కాలం ముగిసిపోనుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎలక్షన్ హడావుడిలో ఉన్న సర్కారు... పీఏసీఎస్ ఎన్నికలపై పెద్దగా దృష్టి సారించడంలేదు. దీంతో ఇప్పుడున్న పాలక మండళ్లకే మరో ఆరు నెలల పాటు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.
2020లో ఎన్నికలు..
పీఏసీఎస్ ప్రత్యక్ష ఎన్నికలను నాటి ప్రభుత్వం 2020లో నిర్వహించింది. 2020 ఫిబ్రవరి 3న సహకార సొసైటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 15న ఎలక్షన్లను నిర్వహించారు. అదేరోజు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటించారు. వెంటనే అధికారులు పాలక మండలి ఎన్నిక ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, చేతులెత్తే పద్ధతి ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకోగా, వెంటనే బాధ్యతలను సైతం స్వీకరించారు. డైరెక్టర్‌గా గెలుపు కోసం రూ.5లక్షలకు పైగా ఖర్చు చేయగా, చైర్మన్ సీటు అంతకు రెట్టింపు ఖర్చు చేయాల్సి వచ్చింది. జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల పరిధిలో చైర్మన్ పీఠం కోసం రూ.20 నుంచి రూ.30 లక్షలు దాటిందంటే.. ఎంత డిమాండ్ పలికిందో అర్థం చేసుకోవచ్చు. చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ఖుర్చుకు వెనకాడ లేదు. ఒక్కో డైరెక్టర్ పరిధిలో కనీసం 50 ఓట్లు లేకున్నా, నెల రోజుల ముందు నుంచి క్యాంపు రాజకీయాలతో వేడి పుట్టించారు. ఐదున్నరేళ్ల పాటు రైతులకు సేవలందించిన పాలక మండళ్లు నేటి అర్ధరాత్రితో దిగి పోనున్నారు.
అక్రమాలు...అవినీతి తిమింగలాలు
జిల్లాలో ఐదున్నరేళ్ల పీఏసీఎస్ పాలనలో చాలా సొసైటీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. పలువురు పాలక మండలి ప్రతినిధులతో పాటు కార్యదర్శి (సీఈఓ) అవినీతి, అక్రమాలతో దివాళా తీయించారు. పంట రుణ మంజూరులో బినామీ దందా, డబుల్ పేర్లు, ఎరువులు, విత్తనాల అమ్మకాలు, ధాన్యం కొనుగోళ్ల సమయంలో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించి అడ్డంగా బుక్కయ్యారు. ఏళ్ల తరబడి ఆడిట్‌కు మంగళం పాడి, సొసైటీల్లో జమ చేయాల్సిన డబ్బులను సొంత జేబులకు మళ్లించి, నిండా ముంచేశారు. కంచనపల్లి, కళ్లెం, బచ్చన్నపేట, నిడిగొండ తదితర పీఏసీఎస్ సొసైటీలు నిత్యం వార్తల్లో నిలిచాయి.
పాలకుర్తి రైతుసేవా సహకార సంఘం
14 సొసైటీలు... 87,210 మంది రైతులు
జిల్లాలో (తరిగొప్పుల/చిల్పూరు మండలాలు మినహా) 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 12 ప్రాథమిక సహకార (పీఏసీఎస్), 2 ఫార్మర్ కోఆపరేటివ్(ఎఫ్‌ఎస్‌సీఎస్) సొసైటీలు. వీటి పరిధిలో 87,210 మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. పంచాయతీ, పరిషత్ ఎన్నికల నేపధ్యంలో పీఏసీఎస్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరో ఆరునెలలు పొడిగించే అవకాశం..
నేటితో తమ పాలక మండలి గడువు ముగిసిపోతుంది. ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించాలని ఆలోచన చేస్తోంది. పీఏసీఎస్‌ల నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వపరంగా రైతులకు అందించే సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు యాసంగి, వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలు, తదితర సేవల విషయంలో దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాం. అందుకే ప్రభుత్వం తమకు మరో ఆరు నెలల పాటు అధికార బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉంది.
– నిమ్మతి మహేందర్‌రెడ్డి, జనగామ పీఏసీఎస్ చైర్మన్