
పాత పద్ధతిలోనే ‘పది’ పరీక్షలు
జనగామ: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విధానం 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమలు కానుంది. పదో తరగతి వార్షికంలో రాత పరీక్షకు 80, ఇంటర్నల్‌కు 20 కలిపి మొత్తంగా 100 మార్కుల విధానాన్ని తిరిగి తీసుకువచ్చారు. గతేడాది నవంబర్ మాసంలో ఇంటర్నల్ మార్కులను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్వహించిన వర్క్‌షాప్‌లో దీనిపై అనేక మంది విద్యావేత్తలు ప్రశ్నించడంతో పాఠశాల విద్యాశాఖ పాత పద్ధతిని అమలు చేయాలనే నిర్ణయంపై ఉత్తర్వులను వెలువరించింది. పాత పద్ధతిలోనే వార్షిక పరీక్షలు రాయనున్న నేపధ్యంలో విద్యార్థులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. ఇంటర్నల్ మార్కులను తిరిగి అమలులోకి తీసుకు రావడంతో చదువులో వెనకంజలో ఉన్న పిల్లలకు మేలు చేకూరే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని మేధావులు వ్యక్తపరుస్తున్నారు.
రాత పరీక్షకు 80,
ఇంటర్నల్ 20 మార్కులు
ఉత్తర్వులు జారీ చేసిన
పాఠశాల విద్యాశాఖ