
లాభాల ఆయిల్ పామ్
జనగామ రూరల్: వంట నూనెల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈనేపథ్యంలో పామాయి ల్ సాగుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తూ అవసరమైన పెట్టుబడి సాయం చేస్తోంది. ఆయిల్ పామ్ మొక్కల అందజేత నుంచి డ్రిప్ పరికరాలు, అంతర పంటల సాగు తదితరాల కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలు ఇస్తున్నాయి. 2021 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 6,976 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం జనగామ మండలం ఎల్లంల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీలో 2లక్షల 25 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి 3,947 ఎకరాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు.
పెరుగుతున్న ధరలు
వంట నూనెల ఉత్పత్తులకు పామాయిల్ వినియో గం పెరగడం, ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభిస్తుండటం ఆయిల్ పామ్ ధరలు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. గతేడాది ఆగస్టు వరకు ఆయిల్ పామ్ టన్ను ధర రూ.14వేలు ఉండగా.. సెప్టెంబర్‌లో రూ.17వేలు, అక్టోబర్‌లో రూ.10 వేలు, నవంబర్‌లో రూ.30వేలు ఉంది. నవంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.20 వేలకు పైగానే కొనసాగిన ధరలు మార్చి 31 వరకు రూ.20,871 కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
నిరంతర దిగుబడి
ఆయిల్ పామ్ దిగుబడి నాలుగేళ్ల తర్వాత మొదలవుతుంది. పదేళ్లలోపు చెట్ల నుంచి ప్రతి ఏడాది 6 టన్నుల వరకు, పదేళ్లు దాటిన చెట్ల నుంచి ఏడాదికి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఏడాదంతా పంట వస్తూనే ఉంటుంది. దీనికి తోడు ప్రారంభంలో అంతర పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసులు ఇతర పంటలతో అదనపు ఆదా యం సమకూరుతుంది.
సాగుకు ప్రోత్సాహకాలు..
ఆయిల్ పామ్ తోటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘నేషనల్ మిషన్ ఎడిబు ల్ ఆయిల్–ఆయిల్ పామ్ ప్లాంటేషన్’ ఏర్పాటు చేసి సబ్సిడీ అందిస్తోంది. ఎకరాకు రూ.50,018 సబ్సిడీ లభిస్తుండగా.. రూ.190 విలువ చేసే మొక్కలను ప్రభుత్వం రూ.20కే ఇస్తోంది. ఎకరాకు దాదాపు 50 నుంచి 57 మొక్కలు నాటాలి. పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరాకు ఏటా రూ.2,100 పెట్టుబడి, అంతర పంటల సాగుకు రూ.2,100 అందిస్తోంది. అలాగే సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడిపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తోంది.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం..
ఆయిల్ పామ్ పంటలకు మంచి ధర లభిస్తోంది. జిల్లాలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం, ప్రైౖవేట్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఆదాయం మెరుగ్గా ఉండడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. పెండింగ్ దరఖాస్తులన్నీ పూర్తికావడంతో మళ్లీ కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకా లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీధర్, ఉద్యాన శాఖ అధికారి, జనగామ
ఇప్పటి వరకు జిల్లా రైతులు సాగు చేసిన ఆయిల్ పామ్ తోట వివరాలు
పంట సాగుపై
ఆసక్తి చూపుతున్న రైతులు
సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
జిల్లాలో 6,976 ఎకరాల్లో సాగు
సంవత్సరం రైతులు ఎకరాలు
2021–22 73 426
2022–23 925 3204
2023–24 720 2170
2024–25 386 1176
మొత్తం 2105 6976

లాభాల ఆయిల్ పామ్