జాబితా సిద్ధం..! గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఆరాటం..!! | Sakshi
Sakshi News home page

జాబితా సిద్ధం..! గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఆరాటం..!!

Published Mon, Jul 31 2023 1:54 AM

- - Sakshi

వరంగల్‌: కులవృత్తుల ఆర్థికాభివృద్ధి కాంక్షిస్తూ... ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూ.లక్ష ఆర్థిక సాయం స్కీంలో చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. మొదటి విడతలో అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ కోసం చూస్తున్నారు. వేలల్లో వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అధికారులు.. అనర్హులను తొలగించారు.

మండలాల వారీగా గ్రామానికి రెండు కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో... రేపటి ఎన్నికల సమయంలో ఓట్లకు వెళితే ఎలా అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో రూ.లక్ష స్కీం కోసం 8,978 దరఖాస్తులు వచ్చాయి. జూన్‌ 6వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ అదే నెల 20వ తేదీన ముగిసింది. ఎంపీడీఓల సమక్షంలో వాటిని పరిశీలన చేసి 6,439 మంది అర్హత ఉన్నట్లు గుర్తించి, 2,359 దరఖాస్తులను తిరస్కరించారు.

మొదటి విడుతలో 15 కులాలకు అవకాశం ఇవ్వగా, బీసీ కులంలోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ తర్వాత, వాటిని అనర్హత జాబితాలో ఉంచారు. మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కమిటీ కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్య నేతృత్వంలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, డీఆర్డీఓ పీడీ సమక్షంలో తుది జాబితాను సిద్ధం చేశారు.

నియోజకవర్గానికి 300 చొప్పున..

జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గానికి 300 చొప్పున మొత్తంగా 900 రూ.లక్ష స్కీం లబ్ధిదారులను కేటాయించారు. ఇందులో జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలు సిద్దపేట పరిధిలో ఉన్నాయి.

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని ధర్మసాగర్‌, వేలేరు మండలా లు హనుమకొండ జిల్లాలో కలువగా, పాలకుర్తిలో ని తొర్రూరు, పెద్దవంగర మహబూబాబాద్‌ జిల్లా, వరంగల్‌ జిల్లాలో రాయపర్తి ఉంది. దీంతో జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాలకు 520, ఇతర జిల్లా పరిధిలో ఉన్న 9 మండలాలకు 380 యూ నిట్లను కేటాయించారు. ఈ లెక్కన జనగామకు 230, స్టేషన్‌ఘన్‌పూర్‌కు 150, పాలకుర్తి నియోజకవర్గానికి 140 యూనిట్లు ఇచ్చారు. దీంతో గ్రామానికి రెండు యూనిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.

ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారిన స్కీం

జిల్లాలో బీసీ కులాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ఈ జాబితాలో మొదటి విడుతలో 15 కులాలకు మాత్రమే ఈ స్కీం వర్తింప జేస్తుంది. కానీ దరఖాస్తులు మాత్రం ఇందులోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వరీలో వీటిని అధికారులు పక్కన బెట్టారు.

దీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, ఇతర ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఈ పథకంతో మైనస్‌ లేదా ప్లస్‌ అవుతుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒక్కో ఊరిలో సుమారు 100 నుంచి 500 వందలకు పైగా బీసీ కులాలకు చెందిన కులవృత్తి దారులు రూ.లక్ష స్కీం కోసం ఎదరుచూస్తున్నారు.

వారంలో పంపిణీకి సిద్ధం

జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారులకు రూ.లక్ష స్కీం చెక్కును మరో వారం రోజుల్లో అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. తుది జాబితా సిద్ధమైనప్పటికీ, ఇంకా బయట పెట్టడం లేదు.

రూ. 5.20 కోట్ల మేర మొదటి విడుతలో అందించనుండగా... ప్రభుత్వం నుంచి బడ్జెట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ లభించగానే.. చెక్కులను పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు.

దళారులను నమ్మొద్దు..

రూ.లక్ష స్కీం కోసం దళారులను ఆశ్రయించవద్దు. ఇందుకు ఎవరికీ కూడా రూపాయి ఇవ్వొద్దు. ప్రభుత్వం కులవృత్తులపై ఆధారపడిన అర్హులైన నిరుపేదలకు రూ.లక్ష సాయం చేస్తుంది. దీనిద్వారా వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని, ఆర్థికంగా ఎదగాలి. ఎవరైన స్కీం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్‌ చేస్తే, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి. – రవీందర్‌, జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

Advertisement
Advertisement