బుగ్గారం: మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజాసమస్యల పరిష్కారంలో కలిసికట్టుగా ముందుకు సాగాలని మండల ప్రత్యేకాధికారి బి.ప్రకాశ్ అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు ప్రస్తావించారు. తాము చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని సిరికొండ సర్పంచ్ పంచిత ధర్మరాజు అన్నారు. విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయని, ఇప్పటివరకు ఎన్ని సమస్యలు పరిష్కరించారో తెలపాలని శెకెల్ల సర్పంచ్ పర్స రమేశ్ బుగ్గారం విద్యుత్ శాఖ ఏఈ రాజశేఖర్‌ని అడగగా.. సరైన సమాధానం రాలేదు. ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే బియ్యం నాణ్యత సరిగా లేదని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కొంతమంది అర్హులు కూడా అనర్హులుగా నమోదయ్యారని పలువురు సర్పంచులన్నారు. ఈజీఎస్ పనుల్లో సైతం పురోగతి లేదని తెలిపారు. ఏపీఎం సృజన్ స్పందిస్తూ.. కష్టతరమైన పనులున్నప్పుడు కూలీల సంఖ్య తగ్గుతుందన్నారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు. ప్రత్యేకాధికారి మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపు చేయడంపై సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఎంపీడీవో సుమంత్, ఎంపీవో సురేశ్ పాల్గొన్నారు.


