గోదావరిలో భక్తుల కార్తీక స్నానాలు
నృసింహుడి సన్నిధిలో కిక్కిరిసిన భక్తులు
ధర్మపురి: కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. సుమారు 30వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు. మంగలిగడ్డ, సంతోషిమాత పుష్కరఘాట్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు దీప దానం చేశారు. సాయంత్రం గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ అలువాలు శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు తదితరులున్నారు.
కోటిలింగాలకు పోటెత్తిన భక్తులు
వెల్గటూర్: కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎస్సై ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పూదరి రమేశ్, ఈవో కాంతారెడ్డి, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


