జగిత్యాల: అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పారదర్శకంగా.. తప్పులు లేకుండా ఓటరు జాబితాకు జిల్లాలో అధికారులు రూపకల్పన చేస్తున్నారు. సర్–2026 ప్రత్యేక సమగ్ర సవరణకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడడంతోపాటు వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారి నుంచి తగిన ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రతి ఓటరుకు తన అర్హతను నిరూపించుకునే అవకాశం కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే సర్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ సవరించిన విషయం తెలిసిందే. ఈనెల 30 వరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే క్లెయిమ్‌లు, అభ్యంతరాల నోటీసుల జారీ, ప్రక్రియ డిసెంబర్ 15 వరకు కొనసాగనుంది. ఈ సారి డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురించనున్నారు.
ఏఎస్‌డీడీ జాబితాలో 72,730 మంది ఓటర్లు
ఓటరు జాబితా సవరణలో భాగంగా మొత్తం 74,730 మంది ఓటర్లను ఏఎస్‌డీడీ జాబితాలో నమోదయ్యారు. ఇందులో గైర్హాజరు, నివాసం మార్చిన వారు, నకిలీల నమోదు, మరణించిన వారిని గుర్తించారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారించారు. నివాసం మార్చుకోని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు, అనెక్సర్ బీని రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు, అనెక్సర్ సీని సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
ఇంటి వద్దకు బీఎల్వోలు
ఓటర్ల ఇళ్లకు బీఎల్వోలు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, వారి వద్ద నుంచి ధ్రువీకరణ పత్రాలు సేకరిస్తున్నారు. గతంలో నోటీసులు అందుకున్న ఓటర్లు ఈఆర్వో ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉండేది. అది అవసరం లేదని, సేకరించిన పత్రాలను ఈసీఐ నెట్‌లో అప్‌లోడ్ చేసి సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు.
అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు
అవసరమైన పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లో వాస్తవంగా అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా స్థానికులతో విచారణ చేయించి నిర్ణయం తీసుకోవాలని అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఓటరు అర్హులు కాదని నిర్ధారణ అయిన సందర్భంలోనే చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన ప్రాంతాల్లో హెల్ప్‌డెస్క్‌లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఓటరు వాదన విన్పించుకునే అవకాశం
ఓటరు పేరు తొలగింపు విషయంలో సంబంధిత వ్యక్తికి నోటీసులు అందించి తన వాదనను విన్పించే అవకాశం కల్పించింది. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫారం 7 ద్వారా అభ్యంతరాలు, తొలగింపునకు దరఖాస్తులు, ఫారం 8 ద్వారా ఓటర్ల వివరాలు సవరణలు పరిశీలిస్తారు.
806
పోలింగ్ కేంద్రాలు
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 806 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1,92,963 నోటీసులు జనరేట్ కాగా, వీటిలో 99.98 శాతం నోటీసులు పంపిణీ చేశారు. 37 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటరు వివరాల ధ్రువీకరణలో భాగంగా 40,683 నోమ్యాపింగ్ నమోదు కాగా, 1,52,279 అనామలసిస్ నమోదు చేశారు. ప్రతి ఓటరు వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరిస్తున్నారు.
ప్రతి ఓటరు హక్కు పరిరక్షణే లక్ష్యం
అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తాం. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా అర్హులైన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. మార్పులు, చిరునామాలకు ఫారం 8, అభ్యంతరాలకు ఫారం 7 ద్వారా తెలియజేయవచ్చు. ప్రజా సమయంలో ప్రతి ఓటు కీలకమైంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
– సత్యప్రసాద్, కలెక్టర్


