జిల్లాలో 278 మందికిపైగా నేరగాళ్లు ఎన్నికల వేళ బైండోవర్.. కదలికలపై నిరంతర నిఘా ఠాణాలకు పిలిచి ప్రత్యేక కౌన్సెలింగ్ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిక
జగిత్యాల క్రైం: జిల్లాలో ఇప్పటివరకు 278 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వీరిని తహసీల్దార్ ఎదుట హాజరుపరుస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత పూచీకత్తు తీసుకుని బైండోవర్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఉన్నవారి నుంచి ఎన్నికల సమయంలో వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
పాత నేరస్తులపైనా నిఘా
రౌడీషీటర్లతో పాటు హిస్టరీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరుల వివరాలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గతంలో నమోదైన కేసులు, శిక్షలు, ప్రస్తుత జీవన విధానం, ప్రవర్తన, కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. నేరాల తీవ్రతను బట్టి హిస్టరీషీట్లు తెరుస్తున్నారు. ఎన్నికలు, పండగలు, గణేశ్ నవరాత్రి ఉత్సవాల సమయంలో ముందస్తుగా స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో కొందరు నేరాలకు స్వస్తి పలికి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుండటం గమనార్హం.


