జగిత్యాలరూరల్: ఆరుగాలం శ్రమించి వరి పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సన్నాలే సాగు చేయాలని ప్రభుత్వం గ్రామగ్రామాన రైతువేదికల్లో రైతులకు అవగాహన కల్పించడంతో ఎక్కువ శాతం మొగ్గుచూపారు. పంట చేతికొస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులకు విక్రయించుకునే పరిస్థితి నెలకొంది. దొడ్డురకం ధాన్యానికే మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో రైస్‌మిల్లర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. సన్నాలకు ధర పడిపోతుండటంతో గిట్టుబాటు కాక ఆందోళన చెందుతున్నారు.
ప్రారంభం కాని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 425 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలోనూ ప్రారంభం కాలేదు. మరోవైపు వరికోతలు ఊపందుకున్నాయి. కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులు, రైస్‌మిల్లర్లకు విక్రయించుకుంటున్నారు. వారం క్రితం సన్నాలకు క్వింటాల్‌కు రూ.3వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.2400కు పడిపోయింది. దొడ్డురకం రూ.2500 ఉండగా.. ప్రస్తుతం రూ.2200కు తగ్గించారు.
బోనస్ ప్రకటన కరువు
సన్నరకాలు సాగుచేస్తే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందరికీ అందివ్వలేకపోతోంది. ఈ వానాకాలం సుమారు 2,37,560 ఎకరాల్లో రైతులు సన్నరకాలు సాగుచేశారు. 4,99,876 టన్నుల దిగుబడి రానుంది. దొడ్డురకం 65,360 ఎకరాల్లో సాగు చేయగా.. 1,69,780 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వంకొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయకపోవడంతో దళారులకే విక్రయించుకుంటున్నారు.
హమాలీలు లేరు.. గన్నీలు రాలేదు
కేంద్రాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇప్పటివరకు గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయలేదు. కేంద్రాల నిర్వాహకులు మాత్రం ధాన్యం వస్తే తూకం వేస్తామని ప్రకటిస్తున్నారు. కానీ.. ఏ కేంద్రంలోనూ ఏర్పాట్లు లేవు.
వరిసాగు విస్తీర్ణం : 3,02,920 ఎకరాలు
సన్నరకాలు : 2,37,560 ఎకరాలు
దిగుబడి : 4,99,876 మెట్రిక్ టన్నులు
దొడ్డురకం : 65,360 ఎకరాలు
దిగుబడి : 1,69,780 మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలు : 425
కొనుగోలు చేస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలుకు 425 కేంద్రాలకు అనుమతులు ఇచ్చాం. రైతులు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనుగోలు చేస్తాం. సన్నరకం, దొడ్డు రకాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
– జితేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారి


