ఎండుతున్న చెరువులు | - | Sakshi
Sakshi News home page

ఎండుతున్న చెరువులు

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● జిల్లాపై ఎల్‌నినో ప్రభావం ● మత్స్యకారుల ఉపాధికి ముప్పు

జగిత్యాలరూరల్‌: ఎల్‌నినో ప్రభావం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరైన వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే వ్యవసాయ బావులు అడుగంటాయి. చెరువులు, కుంటల్లో రోజురోజుకూ నీటిమట్టాలు పడిపోతున్నాయి. రైతులు పంటలు సాగుకు ముందుకురాలేకపోతున్నారు. మరోవైపు చేపల పెంపకంపై ఆధారపడిన మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వారి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెరువులు, కుంటల్లో ఉన్న చేపలకు ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఉపాధి కరువు...

జిల్లాలో 183 చెరువులున్నాయి. అలాగే 580 కుంటులున్నాయి. జిల్లావ్యాప్తంగా 189 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 15,100 మంది సభ్యులున్నారు. 96 మహిళా మత్స్య సహకార సంఘాలు ఉండగా.. అందులో 4,517 మంది సభ్యులున్నారు. వీరంతా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో చేపలు వేసుకుని పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గుతుండటంతో చేపలు పెంచుకోలేని పరిస్థితి నెలకొననుంది.

చేపల సంరక్షణపైనే దృష్టి...

ఇప్పటికే ఆయా గ్రామాల్లో మత్స్యకారులు చేపలు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో నీటిమట్టాలు పడిపోతుండటంతో అందులో ఉన్న పెద్దసైజుగల చేపలను పట్టుకుని విక్రయించుకుంటున్నారు. నీటిమట్టం తగ్గితే చేపలకు వ్యాధులు ప్రబలడంతో పాటు, ఆక్సిజన్‌ అందక చనిపోయే పరిస్థితి నెలకొంది.

50 శాతం చెరువు, కుంటల్లో తగ్గిన నీటిమట్టం

గతేడాది నవంబర్‌లో చెరువు, కుంటల్లో సుమారు 80 నుంచి 90 శాతం నీరు ఉండేది. ప్రస్తుతం 50 శాతం కూడా నీరు లేదు. చెరువు కుంటల్లో 30 నుంచి 40 శాతం మాత్రమే నీరు నిల్వ ఉంది. నీటి నిల్వలు తక్కువైన చెరువులు, కుంటల్లో ఉన్న చేపలను పట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగే చేపలకు పెను ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

నీరు ఉంటేనే చేపలు పెంచాలి

చెరువులు, కుంటల్లో ఎల్‌నినో ప్రభావంతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. నీటి నిల్వలు తగ్గుతున్న ప్రాంతాల్లో మత్స్యకారులు చేపలను పట్టి విక్రయించుకోవాలి. నీటి నిల్వలు తగ్గితే చేపలకు సరైన ఆక్సిజన్‌ అందక వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి.

– కె.సురేశ్‌బాబు, జిల్లా మత్స్య శాఖ అధికారి

జిల్లాలో చెరువులు : 183

కుంటలు : 580

మత్స్య సహకార సంఘాలు : 189

సభ్యులు : 15100

మహిళ సహకార సంఘాలు : 96

మహిళ సభ్యులు : 4517

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement