జగిత్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవసాయాధారితం. వరితోపాటు రకరకాల పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఆయా పంటలకు ఆశించే పురుగులు, తెగుళ్లను అరికట్టేందుకు అన్నదాతలు డ్రోన్ సహాయంతోనే రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. రైతులపై భారం పడకుండా.. కేంద్రప్రభుత్వం డ్రోన్ ప్రమోషన్ స్కీం కింద ఇఫ్కో భాగస్వామ్యంతో సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సబ్సిడీపై డ్రోన్లను అందిస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఆరు సహకార సంఘాలు కొనుగోలు చేయగా.. మరిన్ని సంఘాలు కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.
డ్రోన్ల అవసరం ఎందుకంటే..
ఇప్పటివరకు కూలీల సహాయంతో పంటలపై రసాయనాలు పిచికారీ చేయడంతో రైతులకు ఎక్కువ ఖర్చయ్యేది. పైగా కూలీలు దొరకని పరిస్థితి. కూలీలు స్ప్రేడబ్బాను భుజాన వేసుకుని పొలాల్లో తిరగడం ద్వారా మందు వాసనకు అస్వస్థతకు గురయ్యేవారు. మందు పొలమంతా సరిగా పడేది కాదు. ఎకరం పొలం పిచికారీ చేసేందుకు గంట, రెండుగంటల సమయం పట్టేది. అదే డ్రోన్ ద్వారా కేవలం 7 నుంచి 12 నిమిషాల్లోనే పిచికారీ చేయొచ్చు. డ్రోన్లలో అల్ట్రా వాల్యూమ్ స్ప్రేయింగ్ టెక్నాలజి ఉండటంతో మందును చిన్న తుంపర్లుగా మార్చి పొలమంతా పడేలా చేస్తుంది. దీనివల్ల 20 నుంచి 40 శాతం రసాయన మందు ఖర్చు తగ్గుతుంది. సాధారణ పద్దతిలో ఎకరాకు 150 నుంచి 200 లీటర్ల నీరు అవసరమైతే.. డ్రోన్‌తో కేవలం 10 నుంచి 15 లీటర్ల నీటితోనే ఎకరంలో పిచికారీ చేయొచ్చు. డ్రోన్ రెక్కల నుంచి వచ్చే ఒత్తిడితో మందు ఆకుల పైభాగంలోనే కాకుండా.. మొక్క కింది భాగంలో కూడా పడే అవకాశం ఉంది. మామిడి, మొక్కజొన్న, చెరుకు వంటి ఎత్తైన పంటలపై కూడా పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల నానో యూరియా, డీఏపీ వంటి ఎరువులు ద్రవరూపంలో రావడం, వాటిని వాడేందుకు రైతులు ముందుకొస్తుండటంతో వాటిని డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం మరింతగా తేలికగా మారింది.
సబ్సిడీపై డ్రోన్లు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద సహకార, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సబ్సిడీపై డ్రోన్లు సరఫరా చేస్తున్నారు. 10 నుంచి 20 లీటర్ల సామర్థ్యం గల డ్రోన్ ధర రూ.6 లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఉంటుంది. సహకార సంఘాలు మాత్రం బ్యాటరీలు, జనరేటర్లు వంటి కొత్త ఫీచర్స్ ఉన్న రూ.15లక్షల ఆధునాతన డ్రోన్లను కొనుగోలు చేస్తున్నాయి. వీటికి 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. మహిళా సంఘాలకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పటివరకు జగిత్యాల, బీర్‌పూర్ వంటి ఆరు సహకార సంఘాలు డ్రోన్లను కొనుగోలు చేశాయి. మరిన్ని సంఘాలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. సంఘాలు ఎకరం పిచికారీ చేస్తే రూ.350 నుంచి రూ.400 రైతుల నుంచి తీసుకుంటున్నాయి.
ఒక్కో డ్రోన్‌కు రూ.15 లక్షలు
ఎకరాకు పిచికారీ చేస్తే రూ.350 రూ.400
సహకార సంఘాలకు డ్రోన్లు
జగిత్యాల జిల్లాలో ఇప్పటికే ఆరు, ఏడు సహకార సంఘాలు డ్రోన్లను కొనుగోలు చేశాయి. రాబోయే రోజుల్లో 51 సహకార సంఘాలు కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా రైతులకు ఖర్చుతో పాటు సకాలంలో పనులు పూర్తవుతున్నాయి.
– సీహెచ్.మనోజ్‌కుమార్, సహకార అఽధికారి, జగిత్యాల


