కథలాపూర్: నీటిపారుదల శాఖలో ఏళ్ల తరబడి లస్కర్ల పోస్టులు భర్తీ కాక సాగునీటి సరఫరా నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రతీ 2 వేల ఎకరాలకు ఒక లస్కర్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ, కొన్నేళ్లుగా ఉద్యోగ విరమణతో పోస్టులు ఖాళీ అవుతూ వచ్చాయి. లస్కర్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 64 చెరువులు
కథలాపూర్ మండలంలో 19 గ్రామాలు, 64 చెరువులు, కుంటలున్నాయి. ఇవేకాకుండా మండల సరిహద్దులో రాళ్లవాగు ప్రాజెక్టు నుంచి కుడికాలువ ద్వారా పలు గ్రామాలకు సాగు నీరందుతుంది. కానీ, రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్వహణ సరిగా లేక ఏటా చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నీళ్లున్నా తూముల వద్ద పిచ్చిమొక్కలు పెరగడం, కాలువలు శిథిలావస్థలో ఉండటంతో నీరందించలేని పరిస్థితులున్నాయని ఆయకట్టు రైతులు తెలిపారు. కొన్ని గ్రామాల్లో వీబీజీ రాంజీ పథకం కూలీలతో కాలువల్లో పూడిక తీయిస్తూ గట్టుపైనే పోయించారు. తీరా వర్షాలు కురిసిన సమయంలోఆ మట్టి తిరిగి కాలువల్లో చేరుతోంది. దీంతో కాలువల ద్వారా ఆయకట్టు నీరందడం ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు వాపోతున్నారు.
వీఆర్‌ఏలతో భర్తీ అంతంతే..
నీటి పారుదల శాఖలో లస్కర్ల కొరత ఉండటంతో 2023లో పలువురు వీఆర్‌ఏలను లస్కర్లుగా నియమించారు. మండలంలోని చెరువుల ద్వారా 6 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. చెక్ డ్యాంల ద్వారా 2,700 ఎకరాలు, రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువ ద్వారా 2 వేల ఎకరాలకు నీరందుతుంది. కానీ, లస్కర్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. రాళ్లవాగు కుడికాలువ గేట్‌ను గతేడాది కొందరు ఇష్టమొచ్చినట్లు తిప్పి నీరు వదలడం, బంద్ చేయడం లాంటి ఘటనలు జరిగాయి. దీంతో సరిగా నీళ్లందక పలువురి రైతుల పంటలు ఎండిపోయాయి. ఉన్నతాధికారులు దృష్టిసారించి మండలంలో లస్కర్ల కొరతను తీర్చి ఆయకట్టు భూములకు నీరందేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.


