రోడ్లే.. డంప్‌ యార్డులు | - | Sakshi
Sakshi News home page

రోడ్లే.. డంప్‌ యార్డులు

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

ఈ చిత్రం జాంబాగ్‌ ప్రాంతంలోని బైపాస్‌రోడ్‌. ఇరువైపులా డంపింగ్‌యార్డును తలపిస్తున్నాయి. విరిగిపోయిన కుర్చీలు, చిరిగిపోయిన పరుపులు, ఇతరత్రా సామగ్రి అంతా ఇక్కడే పడేయడంతో బైపాస్‌ డంపింగ్‌యార్డుగా మారింది. నిత్యం వందలాది మంది అటుగా వెళ్తుంటారు. అందరూ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్డును ఆనుకుని ఉన్న శివారు ప్రాంతం. పొలాల మధ్య చెత్తాచెదారం పడేస్తున్నారు. చికెన్‌ వ్యర్థాలు వేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే దుర్వాసన వెదజల్లుతోంది. చెత్తంతా రోడ్డుపైకి వస్తోంది. అధికారులు స్పందించి బైపాస్‌రోడ్డు శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

జగిత్యాల: అసలే జిల్లా కేంద్రం.. అయినప్పటికీ ప్రధాన రహదారులన్నీ డంపింగ్‌ యార్డులను తలపిస్తున్నాయి. చెత్తసేకరణలో నిర్లక్ష్యం చేస్తున్నారా..!? ప్రజలే ఈ రోడ్ల వెంట పడేస్తున్నారా..!? తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో చెత్త సేకరణ జరగలేదనడానికి ఈ చిత్రాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బైపాస్‌రోడ్డులో అత్యధికంగా పాఠశాలలు, వాణిజ్య వ్యాపారాలు అనేకం ఉన్నాయి. ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే గగనంగా మారింది. స్కూల్‌ విద్యార్థులు మహిళలు, ఉద్యోగులు నిత్యం వెళ్తుంటారు. ఈ దుర్వాసన వెదజల్లడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సమీపంలో డంపర్‌బిన్స్‌ లేకపోవడం గమనార్హం. కనీసం వాటిని ఏర్పాటు చేస్తే అందులోనైనా చెత్తను పడేసే అవకాశాలుంటాయి. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

అస్తవ్యస్త్యంగా శానిటేషన్‌

రోడ్లలోనే చెత్త పడేయడం, మున్సిపాలిటీ అధికారులు చెత్త సేకరణ విషయం పట్టించుకోకపోవడం, డ్రైనేజీలను సక్రమంగా తీయకపోవడం మున్సిపాలిటీలో నిత్యకృత్యంగా మారుతోంది. అందులో సిల్ట్‌ నిండుకుపోయి మురికినీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. పందులు, ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు పట్టించుకుని పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

తడిపొడి చెత్త ఎక్కడ..?

వాస్తవంగా ఇంటింటికీ వెళ్లి వాహనాల ద్వారా చెత్త సేకరణ చేపడుతుంటారు. తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించినా సెగ్రిగేషన్‌ ఎక్కడా అమలు కావడం లేదు. వచ్చిన వాహనాల్లోనే తడి, పొడి చెత్తను కలిపి వేస్తున్నారు. ఈ వాహనాలు అక్కడక్కడ రాకపోవడంతో రోడ్లపైనే పడేస్తున్నారు. చెత్తంతా ప్రజలే పడేస్తున్నారా.. లేక డంపింగ్‌యార్డుకు వెళ్లలేక మున్సిపల్‌ వాహనాల్లోంచే పడేస్తున్నారా తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్ల వెంట చెత్తనే కాకుండా చిరిగిపోయిన పరుపులు, ఖాళీ డబ్బాలు, విరిగిన కుర్చీలు, పాత కూలర్లు, సామగ్రి కనిపిస్తున్నాయి.

డంపింగ్‌యార్డు వద్దా.. ఇదే పరిస్థితి

నూకపల్లి వద్ద గల జగిత్యాల డంపింగ్‌యార్డు వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. చెత్తను తీసుకెళ్లి పడేస్తున్నారే తప్ప సెగ్రిగేషన్‌ చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపోతోంది. ఎవరైనా బీడీ, సిగరేట్‌ కాల్చి పడేస్తే అది అంటుకుని మంటలు వ్యాపిస్తున్నాయి. పొగ ఇళ్లలోకి చేరి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మంటలను ఆర్పేందుకు బల్దియాకు వ్యయం పెరిగిపోతోంది.

కాలుష్యం కోరల్లో..

వాస్తవంగా చెత్తను కాల్చవద్దు. బైపాస్‌రోడ్‌, కృష్ణానగర్‌లో పడేస్తున్న చెత్తను కాలుస్తున్నారు. ఈ విషవాయువులు వ్యాపించడంతో మానవులు పీల్చుకుని రోగాల బారిన పడుతున్నారు. బైపాస్‌రోడ్‌లో అత్యధికంగా కాలబెడుతున్నారు. పాలకవర్గం శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.

ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని వివేకానంద

విగ్రహం వద్ద గల బైపాస్‌రోడ్‌. రోడ్డు వెంట చెత్త పేరుకుపోయింది. గాలికి చెత్త అంతా రోడ్డుపైకి రావడంతో ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారుతోంది. ఆ పరిసరాలు మొత్తం దుర్వాసన

వెదజల్లుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement