పొంచి ఉన్న నీటిగండం | - | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న నీటిగండం

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● మూడు రోజుల పాటు మిషన్‌ భగీరథ నిలిపివేత ● అడుగంటిన జిల్లాకేంద్రంలోని ధర్మసముద్రం ● డబ్బా గ్రామంలో చెడిపోయిన ఫిల్టర్‌బెడ్‌ ● ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న బల్దియా

జిల్లాకేంద్రంలో రోజు 18.6 మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే (ఎంఎల్‌డీ) సరఫరా చేస్తుంటారు. కానీ మిషన్‌ భగీరథ నీరు బంద్‌ కావడం, ఒక ఫిల్టర్‌బెడ్‌ మరమ్మతుకు గురికావడం, మరో ఫిల్టర్‌బెడ్‌ వద్దనున్న ట్యాంక్‌లో నీరు అడుగంటిపోవడంతో అక్కడి నుంచి సుమారు 5 ఎంఎల్‌డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో అధికారులు పట్టణంలోని 50 వార్డులకు నీటిని సరఫరా చేసేందుకు నాలుగు ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ సరిపోవడం లేదని తెలుస్తోంది. ఒకవైపు లీకేజీలతో ఎంఎల్‌డీ నీరు వృథాగా పోతోంది. ఎస్సారెస్పీ అధికారులు నీటిని వదిలితే ధర్మసముద్రంలోకి నీరు వస్తే ఎఇబ్బందులు ఉండవు. ఎస్సారెస్పీలో కూడా నీరు లేకపోవడంతో ధర్మసముద్రం చెరువులోకి నీరు చేరని పరిస్థితి నెలకొంది.

కొనుక్కోవడమే శరణ్యం

ఎల్‌నినో ముప్పుతో భూగర్భజలాలన్నీ అడుగంటిపోవడం, బోర్లలో నీరు లేకపోవడం, మిషన్‌ భగీ రథ నీరు నిలిచిపోవడం, ధర్మసముద్రంలో అడుగంటిపోవడంతో ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మరో రెండు రోజుల్లో మిషన్‌ భగీరథ నీరు సరఫరా కాకపోతే పట్టణానికి నీటి బెంగ తప్పదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి మిషన్‌ భగీరథలో ఉన్న పైప్‌లైన్‌ మరమ్మతు త్వరగా చేపట్టడంతో పాటు, ఎస్సారెస్పీ ద్వారా కొద్దిపాటిని ధర్మసముద్రంలో నింపితే మరో మూడు నెలల పాటు ఇబ్బందులు తొలగిచే అవకాశం ఉంది.

జగిత్యాల:ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీరురాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి వచ్చే మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరమ్మతు పనులకు మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిషన్‌ భగీరథ నిలిచిపోవడంతో జగిత్యాల పట్టణవాసులకు జిల్లా కేంద్రంలోని ధర్మసముద్రం నీరే దిక్కయింది. ఈ చెరువు సామర్థ్యం 935 ఎంఎల్‌డీ కాగా.. అంతంతమాత్రమే నీటి నిల్వ ఉంది. ధర్మసముద్రం ఫిల్టర్‌బెడ్‌ నుంచి విద్యానగర్‌, తీన్‌ఖని ట్యాంక్‌లకు.. కొత్తబస్టాండ్‌, ధరూర్‌క్యాంప్‌ ట్యాంక్‌లకు ధరూర్‌ క్యాంప్‌ ఫిల్టర్‌బెడ్‌ నుంచి సరఫరా అవుతాయి. ధరూర్‌ క్యాంప్‌ ఫిల్టర్‌బెడ్‌ పూర్తిగా చెడిపోవడంతో మరమ్మతు చేస్తున్నారు. ప్రస్తుతం ధర్మసముద్రం ఫిల్టర్‌బెడ్‌ నుంచి ఈ రెండు ట్యాంక్‌లకే నీరు వెళ్లడం, అవి కూడా కొద్దిపాటిగానే ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

జగిత్యాల బల్దియా వివరాలు..

జనాభా లక్షకు పైగా

వార్డులు 50

నీటి సరఫరా 18.6 మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే

ప్రస్తుత సరఫరా 5 మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే

ధర్మసముద్రం సామర్థ్యం 935 ఎంఎల్‌

ప్రస్తుతం ఉన్న నీరు సుమారు 200 ఎంఎల్‌

చర్యలు తీసుకుంటున్నాం

మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ధర్మసముద్రంలో నీరు అడుగంటుతోంది. ప్రస్తుతం అక్కడి నుంచే విద్యానగర్‌ ట్యాంక్‌ ద్వారా కొంత మేర సరఫరా చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.

– సత్యప్రణవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement