జగిత్యాల: తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన చిన్నారి కథ సుఖాంతమైంది. రెండు నెలలుగా అమ్మ ప్రేమకు దూరమైన సదరు బాలుడిని అధికారులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాస్ దంపతులు మూడేళ్ల క్రితం ఐదు రోజుల వయస్సున్న బాలుడిని హిందు సాంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్న విషయం తెల్సిందే. దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా జరగలేదంటూ ఆగస్టులో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలుడిని కరీంనగర్‌లోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తీవ్ర మనోవేదనకు గురైన ఆ దంపతులు బాలుడిని తమకు అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను విన్న కోర్టు బాలుడిని అప్పగించాలని అక్టోబర్ 16న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ జాప్యం చేయడంతో తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం చిన్నారిని చూసేందుకు కరీంనగర్‌లోని శిశుకేంద్రానికి వెళ్లారు. వారిని చూసిన ఆ బాలుడు అమ్మా.. నన్ను ఇంటికి తీసుకెళ్లు.. ఇక్కడ భయం వేస్తోంది అంటూ కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రజావాణితో కొలిక్కి
సరత, శ్రీనివాస్ దంపతులు సోమవారం జరిగిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వీరి సమస్యను పరిష్కరించాలని శిశు సంక్షేమాధికారులను ఆదేశించారు. ఈ విషయం అటు మహిళా కమిషన్, మంత్రి సీతక్క దృష్టికి వెళ్లడంతో హైకోర్టు ఆదేశాల మేరకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి బాలుడిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు కలెక్టర్ సదరు చిన్నారిని దంపతులకు అప్పగించేలా చర్యలు తీసుకున్నారు.
అంతులేని ఆనందం..
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారిలో అంతులేని ఆనందం వెల్లివిరిసింది. చిన్నారి నానమ్మ కూడా తమకు ఎవరూ లేరని, పిల్లాడే సర్వస్వమని విలపించింది. రాత్రి తీసుకొచ్చే సమయంలో నిద్రలో ఉన్నాడని, అప్పటినుంచి ఇలానే ఉన్నాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. చిన్నారి వారి చెంతకు చేరడంతో వారి కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది.
విలేకరుల చొరవ..
చిన్నారిని దంపతులకు అప్పగించడంతో వారి కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లడంతోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతోనే తమ సమస్యకు పరిష్కారం లభించిందని ఆ కుటుంబం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.
ఆస్తికోసమేనా?
సరిత దంపతులకు సంతానం లేకపోవడంతో ఐదు రోజుల వయస్సున్న బాలుడిని చేరదీసి మూడేళ్ల నుంచి పెంచుకుంటున్నారు. వారి బంధువులే వారి ఆస్తిపై కన్నేసి శిశు సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభం శుభం తెలియని ఆ చిన్నారిని దూరం చేయడం అందరినీ కలిచివేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు బలంగా కొట్లాడి శిశు గృహంలో ఉన్న ఆ చిన్నారిని విడిపించుకోవడం గమనార్హం.


