‘పీఎం రహత్’ కింద రూ.1.50లక్షల ఉచిత వైద్యం ఈడీఏఆర్ పోర్టల్‌లో ప్రతి ప్రమాద కేసు నమోదు అత్యవసర పరిస్థితుల్లో 112 సేవలు
జగిత్యాల: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ఎంతో ముఖ్యం. తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో చికిత్స అందిస్తే మనిషి బతికే అవకాశం ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ పథకాన్ని రూపొందించింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతోపాటు, తక్షణమే రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించాల్సి ఉంటుంది. చికిత్స కాలం, ఖర్చుల భారం బాధితులపై పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టారు.
ఈడీఏఆర్ పోర్టల్‌లో ప్రతి ప్రమాద కేసు నమోదు..
రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే వివరాలు సేకరించి పథకం అమలు కావాలంటే ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ (ఈడీఏఆర్) పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సీరియస్‌గా ఉన్నది 24 గంటల్లో, మిగతావి 48 గంటల్లో చేయాల్సి ఉంటుంది.
ప్రమాద కేసుల ఆన్‌లైన్‌లో నమోదుకు ప్రత్యేకాధికారి
ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు కావాలనే ఉద్దేశంతో ప్రత్యేకాధికారిని నియమిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని అర్హత గల ఆస్పత్రులకు తరలించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో 112 సేవలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యం కాకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే చికిత్స అందడంతోపాటు, ఈ పథకం సహాయం పొందవచ్చు.
పథకం అమలుకు అన్ని ఆస్పత్రుల్లో నమోదు..
పీఎం రహత్ పథకం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ అవసరమైన నమోదు ప్రక్రియను చేయాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాద కేసులను నేషనల్ అథారిటికి చెందిన టీఎంఎస్ 2.0 పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాద ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలి..
రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జాతీయ సమాచార కేంద్రం జిల్లా ఇన్ఫర్మాస్టిక్స్ అధికారిని రోడ్డు భద్రత కమిటీలో క్రియాశీల సభ్యుడిగా చేర్చనున్నారు. ఈడీఏఆర్ పీఎం రహత్ పోర్టల్ నిర్వహణకు సాంకేతిక సహకారం పొందాల్సి ఉంటుంది.
పథకంపై ప్రజల్లో అవగాహన..
పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నెక్ట్‌జెన్ ఎం పరివాహన్ మొబైల్ యాప్‌ను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాప్ ద్వారా రోడ్డు ప్రమాదాల సమాచారం అందించడం, క్లెయిమ్‌ల స్థితిని తెలుసుకోవడంపై ప్రజలకు అవగాహన కలుగుతుంది.
నమోదు చేయాలి
పీఎం రహత్ పథకం అమలులోకి తీసుకువచ్చి ప్రమాద కేసులను ఈ పథకం కింద నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో జరిగే ప్రతి రోడ్డు ప్రమాద కేసును నమోదు చేసి అర్హులైన బాధితులకు పథకం ద్వారా వైద్యసేవలు అందించనున్నాం. ఆరోగ్యశ్రీ మేనేజర్ వైద్యాధికారి సమన్వయంతో పనిచేస్తూ ప్రమాద కేసుల ఆన్‌లైన్ నమోదు పర్యవేక్షిస్తారు.
– సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్


