పడిపోతున్న భూగర్భ జలం | - | Sakshi
Sakshi News home page

పడిపోతున్న భూగర్భ జలం

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

● 4.21 మీటర్లకు తగ్గిన నీటి మట్టం ● కొడిమ్యాల మండలంలో 10.18 మీటర్ల లోతులో.. ● అప్రమత్తం చేస్తున్న జిల్లా యంత్రాంగం

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షభావం ఏర్పడి భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లోనే 0.56 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. గతేడాదితో పోల్చితే 1.26మీటర్లు పడిపోవడం కొంత ఆందోళనకరంగా మారింది. మరోవైపు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సాగు, తాగునీటిని పొదుపుగా వాడాలని గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం మొదలుపెట్టారు.

మున్సిపాలిటీల్లో పెరుగుతున్న నీటి వినియోగం

జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో 5 నుంచి 6లక్షల మంది జనాభా ఉంటుంది. రోజువారి అవసరాలకు నీటి వినియోగం పెరగడంతో నీటిమట్టం రోజు రోజు పడిపోతోంది. జిల్లాకేంద్రంలో 8.01 మీటర్లు, కోరుట్లలో 8.46, మెట్‌పల్లిలో 5.31, రాయికల్‌లో 3.17, ధర్మపురిలో 3.86 మీటర్లకు భూగర్భజలం పడిపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. నాన్‌ ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్‌, కొడిమ్యాల, భీమారం మండలాల్లో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. మల్యాలలో 7.89 మీటర్లు, కొడిమ్యాలలో 10.18. కథలాపూర్‌లో 2.15, మేడిపల్లిలో 4.01, భీమారంలో 2.60 మీటర్లకు నీటిమట్టం పడిపోవడంతో బావుల్లో నీరు లోతుకు చేరింది.

ఒక్క నెలలోనే..

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఒక్క నెలలోనే నీటిమట్టం సగటున 0.52 మీటర్లకు పడిపోయింది. సెప్టెంబర్‌లో 3.65 మీటర్ల లోతులో నీరు ఉండగా.. అక్టోబర్‌ చివరి నాటికి 0.56 మీటర్లు తగ్గి 4.21 మీటర్లకు చేరుకుంది. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే 1.26 మీటర్లు తగ్గింది.

ఆయకట్టు మండలాల్లోనూ..

ఆయకట్టు మండలాల్లోనూ నీటిమట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారం మండలంలో 3.39 మీటర్లు, ఎండపల్లిలో 5.90, గొల్లపల్లిలో 2.55, జగిత్యాలరూరల్‌లో 2.15, పెగడపల్లిలో 2.21, సారంగాపూర్‌లో 4.34, వెల్గటూర్‌లో 2.58, ఇబ్రహీంపట్నంలో 4.49, మల్లాపూర్‌లో 4.49 మీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

రానున్న రోజుల్లో మరింత లోతుకు

రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భజల మట్టం మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉంది. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వాల్టా చట్టం ప్రకారం బోరు బావులు తవ్వాలంటే భూగర్భజల శాఖ అనుమతి తీసుకోవాలి.

– అలువాల శ్రీకాంత్‌,

భూగర్భజల శాఖాధికారి, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement