జగిత్యాలటౌన్: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రూ.18వేల వేతనం అందించాలని, వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయిశ్వరి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటీయూసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి అంగరి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు పీఎఫ్, హెల్త్‌కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఐసీడీఎస్‌లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు, అందె వంశీ, రామిల్ల రాంబాబు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.


