‘సూరమ్మ’ నిర్వాసితులకు పరిహారం | - | Sakshi
Sakshi News home page

‘సూరమ్మ’ నిర్వాసితులకు పరిహారం

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

● 518 ఎకరాలకు రూ.55 కోట్లు చెల్లింపు ● ఇక చేయాల్సిందే కాలువ పనులే

కథలాపూర్‌(వేములవాడ): వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, మేడిపెల్లి, బీమారం మండలాల రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉండగా.. ప్రధానకాలువ భూనిర్వాసితులకు పరిహారం డబ్బులు వారి ఖాతాల్లో చేరాయి. ఇక పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపెల్లి ఎత్తిపోతల పథకం ఫేజ్‌–2 స్టేజీ 1 పనుల్లో భాగంగా సూరమ్మ ప్రాజెక్టు నిర్మించి కుడి, ఎడమ కాలువల ద్వారా మెట్టప్రాంతమైన కథలాపూర్‌, మేడిపెల్లి, బీమారం, రుద్రంగి మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరందించడం లక్ష్యం. గత ప్రభుత్వ హయంలో పదేళ్లుగా సూరమ్మ ప్రాజెక్టు పనులు చేపట్టలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. మత్తడి పనులు పూర్తయి, ప్రస్తుతం తూం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

2018లో భూమిపూజ

బీఆర్‌ఎస్‌ హయాంలో సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ పనులకు రూ.204 కోట్లు మంజూరు చేస్తూ 2018 జూన్‌ 22న అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. తర్వాత పనులు చేపట్టకపోవడంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌తోపాటు నాలుగు మండలాల కాంగ్రెస్‌ నాయకులు పలుమార్లు నిరసనలు తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పనుల్లో కదలిక వచ్చి మూడేళ్లుగా కేవలం ప్రాజెక్టు పనులే సాగుతున్నాయి. కాగా, కాలువ పనులకు ఇంకెంత కాలం పడుతోందనని ఈ ప్రాంత రైతులు నిరాశ చెందుతున్నారు.

ఖాతాల్లోకి రూ.55 కోట్లు

సూరమ్మ ప్రాజెక్ట్‌ కుడి ఎడమ కాలువ పనుల భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. కథలాపూర్‌, మేడిపెల్లి, బీమారం మండలాల్లోని ఆయా గ్రామాల పరిధిలో 518 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. గత నెలలోనే భూములు కోల్పోయిన రైతుల ఖాతాల్లో రూ. 55 కోట్లు జమ చేశారు. మరోవైపు ప్రధాన కుడి ఎడమ కాలువలకు అనుసంధానంగా ఉపకాలువల నిర్మాణాలకు భూ సేకరణ పూర్తి కావాల్సి ఉంది.

సూరమ్మ ప్రాజెక్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement