జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లకు డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు టెండర్లు నిర్వహించారు. ఆ సమయంలో టెండర్ పొందిన కొందరు నిర్వాహకులు ఇతరులకు కిరాయి ఇచ్చి అద్దె దందా కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం టెండర్లు పొందినవారే కొనసాగాలి. ఇంత వ్యవహారం జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లకు టెండర్లు నిర్వహించాలని నిర్ణయించారు. గత టెండర్‌దారులకు నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఈనెల 3 వరకు మొత్తం రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 17 ఏళ్ల క్రితం టెండర్ నిర్వహించగా, పాత వారే కొనసాగుతున్నారు. అందులో బినామీలే అత్యధికంగా ఉన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి టెండర్లు నిర్వహించాలి. కానీ, జగిత్యాల జిల్లాగా ఏర్పడి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ టెండర్లు నిర్వహించలేదు.
జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో..
జిల్లా కేంద్రంగా అవతరించడంతో జగిత్యాలలో మార్కెట్ ధరలు, ప్రజల తాకిడి, వాణిజ్య వ్యాపారాలు రోజురోజుకు పెరిగిపోయాయి. కార్పోరేట్‌కు దీటుగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలు వెలుస్తున్నాయి. మున్సిపల్ కాంప్లెక్స్‌లు విలువైన స్థలాల్లో ఉండటంతో వీటికి కొత్తగా టెండర్లు నిర్వహిస్తే బల్దియాకు మంచి ఆదాయం సమకూరనుంది. కాగా, గతంలో టెండర్ పొందిన వారు అప్పటి కిరాయే చెల్లిస్తున్నారు. కొందరు పూర్తి అద్దె చెల్లించని వారు కూడా ఉన్నారు.
198 దుకాణాలు
జగిత్యాల బల్దియాకు సంబంధించి అంగడిబజార్, పార్క్ సంది, ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా, పాతబస్టాండ్ సమీపంలో 198 దుకాణాలున్నాయి. ఇందులో ఒకట్రెండు మినహా అన్ని అద్దెకే నడుస్తున్నాయి. 17 ఏళ్ల క్రితం నిర్వహించిన టెండర్ల ద్వారా అప్పుడే బల్దియాకు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. మళ్లీ టెండర్లు నిర్వహిస్తే మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రైవేటు కాంప్లెక్స్‌లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల అద్దె ఉంది. మున్సిపల్ కాంప్లెక్స్‌లకు మాత్రం రూ.10 వేల వరకు ఉంటుంది. ఒక్కరిద్దరు మినహా షాపుల్లో వేరేవారే కొనసాగుతున్నారు.
ఇప్పటి నుంచే ప్రయత్నాలు
టెండర్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొనడంతో ఎలాగైనా దక్కించుకోవాలని పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో టెండర్లు పొందిన వారు సైతం మళ్లీ పొందేలా రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవేళ టెండర్లు నిర్వహిస్తే మున్సిపల్‌కు అత్యధికంగా ఆదాయం లభించే అవకాశాలు ఉండగా, వాటికి డిమాండ్ సైతం చాలా ఉంది.
టెండర్లు నిర్వహిస్తాం
మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లకు సంబంధించి త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాం. గతంలో టెండర్లు పొందిన వారికి నోటీసులు జారీ చేశాం. నవంబర్ 3న ముగుస్తుంది. వివరాలన్నీ పరిశీలించిన వెంటనే టెండర్లు వేస్తాం.
– సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల


