తగలబడుతోంది..! | - | Sakshi
Sakshi News home page

తగలబడుతోంది..!

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

జగిత్యాల: మున్సిపాలిటీల్లో ప్రజలు తడి, పొడి చెత్త వేరుచేసి ఇస్తే.. పారిశుధ్య సిబ్బంది దానిని డంపింగ్‌యార్డుకు తరలించి సెగ్రిగేషన్‌ చేస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ప్రతి కౌన్సిల్‌ సమావేశాల్లోనూ సభ్యులు అవగాహన కల్పించాలని మున్సి పల్‌ అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నా.. ముందడుగు మాత్రం పడడం లేదు. తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు వెనుకబడుతున్నారు. ప్రతి ఇంటికీ రెండు రకాల చెత్త డబ్బాలు ఇస్తామని చెప్పినా అందించడం లేదు. దీంతో మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త, బయోమెడికల్‌ వేస్టేజీ విపరీతంగా వస్తోంది. తడి, పొడి చెత్తను ఒకే డబ్బాలో వేసి పారిశుధ్య సిబ్బందికి ఇస్తుండడం.. వారు డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లి పడేస్తున్నారు. పొడిచెత్త ఉన్నచోట గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్‌, బీడీ కాల్చి అందులో పడేస్తుండడంతో మంటలు అంటుకుని దట్టమైన పొగలు లేస్తున్నాయి. జగిత్యాల ము న్సిపాలిటీ డంప్‌యార్డులో ఇలాగే మంటలు ఎగిసిపడుతూ.. పొగంతా డబుల్‌బెడ్‌రూం కాలనీని చుట్టుముట్టుతోంది. దీంతో కాలనీవాసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

జంకుతున్న కార్మికులు

డంపింగ్‌యార్డులో సెగ్రిగేషన్‌ చేసే వ్యవస్థ లేకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. బీడీ, సిగరేట్‌ కాల్చి పడేయడంతో మంటలు వ్యాపిస్తున్నాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తడి, పొడి చెత్త ఎక్కడ..?

తడి, పొడి చెత్తను వేరుచేసి కార్మికులకు అందించాలని, ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, అధికారులు ప్రతి మున్సిపల్‌ సమావేశంలో చెబుతున్నా.. అమలులో మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది. తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వాలన్నది సాధ్యమవడం లేదు. దీంతో ఇష్టానుసారంగా డంపింగ్‌యార్డులో పడేయడంతో ఆ కాలనీవాసులంతా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ తడి, పొడి వేర్వేరుగా సేకరించాలి. ప్రతివార్డుకు మున్సిపల్‌ వాహనాలు వెళ్తాయి. ఇళ్ల యజమానులు ఇచ్చినట్లే చెత్తను కార్మికులు తీసుకుని వెళ్తున్నారు. అదే సమయంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో మహిళలు చెత్తను వేరు చేయకుండానే ఇస్తున్నారు. వేరు చేసి ఇస్తే తడి చెత్త ఎరువుగా ఉపయోగపడుతుంది. పొడిచెత్తను విక్రయించే అవకాశం ఉంటుంది. ఫలితంగా బల్దియాకు ఆదాయం కూడా వస్తుంది. కానీ మున్సిపాలిటీల్లో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో రూ.లక్షల వ్యయంతో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసేందుకు షెడ్లను నిర్మించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.

నిత్యం మంటలే..

జగిత్యాల డంపింగ్‌యార్డు ప్రాంతంలో నర్సింగాపూర్‌ గ్రామం ఉంది. సమీపంలోనే న్యాక్‌ కేంద్రం ఉంది. దానికి ఆనుకునే డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. వీటిలో 3 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. డంపింగ్‌యార్డులో మంటలు అంటుకుని పొగలు వ్యాపిస్తున్నాయి. రోజుల తరబడి దట్టమైన పొగలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు నానా ఇబ్బందలు పడుతున్నారు. న్యాక్‌ కేంద్రంలో శిక్షణ పొందుతున్న వారు పొగను భరించలేకపోతున్నారు. పొగతో మనుషుల గుండె, ఊపిరితిత్తులపై అధిక ప్రభావం పడుతుంది. మనుషుల ఆరోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాల్లో పీఎం 2.5, పీఎం 10, నైట్రోజన్‌ ఆకై ్సడ్‌, సల్ఫర్‌ ఆకై ్సడ్‌ ఉంటాయి. గాలిలో పీఎం 2.5 స్థాయికి పెరిగే కొద్దీ వృద్ధులు, పిల్లలు శ్వాసకోశ వ్యాధులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. డంపింగ్‌యార్డులో పొగలు అంటుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం బల్దియాలపై ఉంది.

తడి, పొడి చెత్త వేరుపై స్పందన కరువు

డంపింగ్‌యార్డులో తరచూ మంటలు

కాలుష్యంతో ప్రజలకు తప్పని ఇక్కట్లు

చుట్టుగ్రామాలకు వ్యాపిస్తున్న పొగలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement