మెట్‌పల్లిరూరల్: ఉత్సవాలు, పండుగలు, ఊరేగింపు, శోభాయాత్ర, ఇతరత్రా కార్యక్రమాలు.. సందర్భం ఏదైనా వినోదం పేరిట యువత హద్దులు మీరుతోంది. పండుగవేళల్లో ఉత్సాహంతో నిర్వహించుకునే వేడుకలు ఒకవైపు సంతోషాన్ని ఇస్తే.. మరోవైపు శృతిమించిన ప్రవర్తన వివాదాలకు కారణమవుతోంది. ఆనందోత్సాహాలతో సాగాల్సిన వేడుక కొందరి తీరుతో గొడవలు, ఘర్షణలకు వేది కగా మారుతోంది. మద్యంమత్తు, వర్గపోరు, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రశాంత వాతావరణం దెబ్బ తింటోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నపాటి విషయాలే ఘర్షణ వైపు..
చిన్నపాటి విషయాలతో మొదలయ్యే వివాదాలు చివరకు ఘర్షణలకు దారితీస్తున్నాయి. పలు కార్యక్రమాల్లో రెచ్చిపోతున్న యువత.. రాత్రి సమయాల్లో ద్విచక్రవాహనాలపై విన్యాసాలు చేస్తూ ప్రమాదకరంగా చక్కర్లు కొట్టడం.. గ్యాంగ్‌లతో వెళ్లి ఘర్షణలకు పాల్పడుతూ అలజడి సృష్టించడం కలకలం రేపుతోంది. చిన్నా, పెద్ద వేడుకలు ఏదైనాగానీ.. వినోదం పేరిట హద్దులు దాటుతున్న యువత తీరు ఆందోళన కలిగిస్తోంది. తమ చేష్టలతో ప్రజానీకానికి ఇబ్బందికరమని తెలిసినప్పటికీ అదే ధోరణితో వ్యవహరిస్తూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మెట్‌పల్లి మండలంలో పలుచోట్ల వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర సమయంలో వివాదాలు చోటుచేసుకోగా.. ఆ సమయంలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. తాజాగా బతుకమ్మ పండుగరోజున మెట్‌పల్లి మండలం వెల్లుల, బండలింగాపూర్ గ్రామాల్లో యువకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు చర్చనీయాంశంగా మారాయి. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్‌లో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒకదశలో పోలీసులపైకి కూడా కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు మొత్తం 26 మంది యువకులపై కేసు నమోదు చేశారు. అయితే కొందరిని కాపాడేందుకు పోలీసులకు రాజకీయంగా ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. అయినప్పటికీ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి పలువురిపై కేసులు నమోదు చేయడం గమనార్హం.
ఇబ్బందికరమైన వాతావరణం
గ్రామాల్లో కొందరి తీరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగలు వస్తే ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు సందర్భాల్లో అవగాహన కల్పిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని చెబుతున్నారు. ఏమైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే పిల్లల భవిష్యత్ పాడువుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ యువత కొంతవరకు దారి తప్పుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఉత్సవాల్లో హద్దుమీరుతున్న యువకులు
వివాదాలు జరిగి ఘర్షణలకు దారితీస్తున్న వైనం
గ్రామాల్లో ఇబ్బందికరమైన వాతావరణం
బండలింగాపూర్‌లో 26 మంది యువకులపై కేసు


