పదవులకే పరిమితం.. సేవలు శూన్యం | - | Sakshi
Sakshi News home page

పదవులకే పరిమితం.. సేవలు శూన్యం

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

పదేళ్లయినా నిరుపయోగంగానే వ్యవసాయ మార్కెట్‌ గోదాం, కమిటీ కార్యాలయం ఉన్నా కొనుగోళ్లకు దూరం పంటలు అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్న అన్నదాతలు

పెగడపల్లి: పెగడపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఏర్పాటు చేసి ఏళ్లు కావస్తున్నా.. రైతులకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సేవలూ అందించడం లేదు. ఇక్కడ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటుకు ముందు గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్‌కు అనుబంధంగా ఉండేది. సబ్‌ మార్కెట్‌ కొనసాగించి ఇక్కడి నుంచి తరలిస్తున్న ధాన్యానికి చెక్‌ పోస్టు ద్వారా మార్కెట్‌ ఫీజు వసూలు చేసేది. సబ్‌ మార్కెట్‌ యార్డును విభజించి 2015లో ప్రత్యేక మార్కెట్‌ ఏర్పాటు చేశారు. అనంతరం మొదటిసారి 2016లో మార్కెట్‌ కమిటీకి పాలకవర్గం నియామకమైంది. ఆ సమయంలో ఉన్న పాలకవర్గం గ్రామ శివారులోని ప్ర భుత్వ స్థలంలో గోదాము, మార్కెట్‌ కమిటీ కార్యాలయం నిర్మించింది. మార్కెట్‌ ఏర్పాటు చేసి ఏళ్లు కావస్తున్నా.. వ్యాపారులను నియమించడంగానీ, ధాన్యం కొనుగోళ్లుగానీ చేపట్టడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడంతో మార్కెట్‌ నిరుపయోగంగా ఉంటోంది. మార్కెట్‌తో నాయకులకు పదవులు వస్తున్నాయి తప్ప తమకు సేవలు మాత్రం అందడం లేదని రైతులు చెబుతున్నారు. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తున్నామని, ఇతర పంటలను అమ్ముకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.2,50 కోట్లతో అభివృద్ధి పనులు

ఇక్కడ సుమారు రూ.2.50కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.50 లక్షలతో మార్కెట్‌ కమిటీ కార్యాలయం, రూ.1.5 కోట్లతో గోదాం, మార్కెట్‌ ఆవరణలో స్థలం చదును, ప్రహరీ, స్వాగత ద్వారం వంటి వాటికి రూ.50 లక్షల మేర ఖర్చు చేశారు. ఈవన్నీ పూర్తి చేసిన అధికారులు ధాన్యం కొనుగోలుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మండలంలో 23 గ్రామాలున్నాయి. రెండు గ్రామాలు మినహా 21 గ్రామాలు పూర్తిగా ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. ఆయకట్టు పుణ్యమా అని రెండు పంటలు పండుతాయి. సుమారు 28 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 26 వేల ఎకరాల్లో వరి పంటనే సాగు చేస్తున్నారు. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఽకేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తున్నారు. కనీసం వ్యవసాయ మార్కెట్‌ ఆధ్వర్యంలో కమీషన్‌పై కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌ ఆవరణలో సిమెంట్‌ ప్లాట్‌ఫాంలు లేక ధాన్యం పోయాలంటే రైతులకు ఇబ్బందిగా ఉంటుందని, ఓపెన్‌ షెడ్లు నిర్మించాల్సి ఉందని మార్కెట్‌ కమిటీ పాలకవర్గం చెబుతుండడం గమనార్హం. సంబంధిత అధికారులు స్పందించి కనీసం యాసంగి, వానాకాలం సీజన్‌లోనైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే వచ్చే కమీషన్‌ ద్వారా మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, ఆ దిశగా కృషి చేయాలని మండల రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement