ధర్మపురి: ప్రయాణీకుల సౌకర్యార్థం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బస్టాండ్‌ను ఆధునీకరించే పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 25న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నందున పనులు పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట గ్రంథాలయ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, ఆర్టీసీ అధికారులు, నాయకులు తదితరులున్నారు.
ఉద్యానపంటలకు ప్రోత్సాహం
జగిత్యాలరూరల్: ప్రభుత్వం ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన జాతీయ ఉత్తమ మహిళా రైతు బండారి విజయ సాగు చేస్తున్న వినూత్న పంటలను రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఉద్యాన పంటలు సాగు చేస్తే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. డ్రిప్ పద్ధతిలో సాగుతో దిగబడి పెరుగుతుందన్నారు. ఉద్యానశాఖ అధికారులు ఐలయ్య, అర్చన, వంశీకృష్ణ, సర్పంచ్ కొలపాక రాధా రాజు, ఏఈవోలు శైలిని, వెంకటేష్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలి
కథలాపూర్: ప్రజల భద్రతలో విజిబుల్ పోలీసింగ్ కీలకపాత్ర పోషిస్తుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రాత్రివేళ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, దొంగతనాలు, గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలపాలపై నిఘా కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పంచాలన్నారు. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కోరుట్ల సీఐ తిరుపతి, ఎస్సై రవికిరణ్ పాల్గొన్నారు.
ఔట్‌సోర్సింగ్‌కు మార్చి అన్యాయం
జగిత్యాలటౌన్: సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్ష గురువారం పదో రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట బైటాయించిన ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసిన తమను ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చి అన్యాయం చేసిందన్నారు. అసలే అంతంత మాత్రం వేతనాలతో పనిచేస్తున్న తమను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. సమాన పనికి సమాన వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తిరుమల్, జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డులో మంటలు
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో మంటలు ఎగిసి పడుతున్నాయి. నూకపల్లి శివారులో ఏర్పాటు చేసిన ఈ డంప్‌యార్డ్ పక్కనే సుమారు 4,520 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. ఇక్కడ సుమారు మూడు వేలకు పైగా లబ్ధిదారులు ఉంటున్నారు. వారికి డంప్‌యార్డు తలనొప్పిగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్, బీడీ ముక్కలు పడేస్తుండడంతో తరచూ మంటలు వ్యాపిస్తున్నాయి. గురువారం పెద్ద ఎత్తున మంటలు లేవడంతో దట్టమైన పొగ డబుల్‌బెడ్‌రూం ఇళ్లలోకి వ్యాపించింది. దీంతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని ప్రజలు పేర్కొన్నారు. కొంతమంది జగిత్యాలలోని బంధువుల ఇళ్లకు వస్తున్నారు. చిన్నారు, వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. డంప్‌యార్డ్ సమస్య పరిష్కరించాలని మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు.


