జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్‌లో జిల్లాలో 1.80 లక్షల ఎకరాల వరకు సన్న వరిని రైతులు సాగుచేశారు. ప్రస్తుతం ఆ పంట గింజదశకు చేరుకుంటోంది. ఈ సమయంలో రెప్పరాల్చే పురుగు, అగ్గితెగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రెప్పరాల్చే పురుగు పగటి పూట వరి మొదళ్లలో ఉంటూ.. రాత్రివేళ వరి కంకుల మొదళ్లను కత్తిరిస్తున్నాయి. ఈ పురుగును సకాలంలో గుర్తించకపోతే రెండుమూడు రోజుల్లోనే పొలమంతా విస్తరించి.. 30 నుంచి 50 శాతం వరకు నష్టం కలిగిస్తుంది. పురుగు ఉధృతి జగిత్యాల, సారంగాపూర్, గొల్లపల్లి, రాయికల్ మండలాల్లో ఎక్కువగా ఉన్నట్లు అన్నదాతలు చెబుతున్నారు.
అగ్గితెగులుతోనూ ఇబ్బందే..
సన్నరకానికి ఎక్కువగా నష్టం చేసే ప్రమాదకరమైనది అగ్గితెగులు. దీనిని మెడవిరుపు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ఆశించినప్పుడు వరి మెడ భాగం నల్లగా మారి కుళ్లిపోతుంది. కంకికి సరైన పోషకాలు అందక గింజలు పాలుపోయ తాలుగా కనిపిస్తుంది. గింజ దశలో ఆశిస్తే 50 నుంచి 80 శాతం వరకు నష్టం చేకూరుస్తుంది.
వాతావరణ మార్పులే కారణం
గింజ దశలో పురుగులు, తెగుళ్లు ఆశించడానికి వాతావరణ మార్పులే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగినా.. తగ్గినా.. గాలిలో తేమ పెరిగినా.. పొలంలో నీరు ఎక్కువగా ఉండి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నా.. రెప్పరాల్చే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. రాత్రివేళ చల్లగా ఉండి.. పగటి వేళల్లో అధిక వేడి ఉంటే అగ్గి తెగులు ఆశిస్తుంది.
వ్యవసాయాధికారుల క్షేత్ర సందర్శనలు
జిల్లాలో చాలా ప్రాంతాల్లో పురుగులు, తెగుళ్లు ఆశించడంతో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. గింజ దశకు చేరుకుని మరో 15 నుంచి 20 రోజుల్లో కోతకు వచ్చే పంటలో అకస్మాత్తుగా పురుగులు ఆశిస్తుండటంతో ఇటు రైతులు, అటు అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన పొలాల్లో పూర్తి స్థాయిలో యూరియా నిలిపివేయాలని, నీటిని నిల్వ ఉంచకుండా ఆరుతడి పద్ధతిన అందించాలని సూచిస్తున్నారు.
వాతావరణ మార్పులతో పురుగు ఉధృతి
గింజదశలో నష్టం కలిగిస్తున్న కీటకం
అగ్గితెగులుతోనూ అన్నదాతల్లో ఆందోళన


