డీ–1 పట్టాల గోల్‌మాల్‌!? | - | Sakshi
Sakshi News home page

డీ–1 పట్టాల గోల్‌మాల్‌!?

Sep 29 2026 12:27 AM | Updated on Sep 29 2026 12:27 AM

ఎస్సారెస్పీలో భూములు కోల్పోయిన నిర్వాసితులు మారుమూలన భూముల కేటాయింపు ఆసక్తి చూపని నిర్వాసితులు వందల ఎకరాల్లో నకిలీల పాగా భూ దందాకు నేతల అండ? రీసర్వేతో వెలుగులోకి అక్రమాలు

కోరుట్ల: ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరి హారం కింద ప్రభుత్వ భూమిని కేటాయించిన డీ–1 పట్టా భూముల్లో జరిగిన గోల్‌మాల్‌ రీ సర్వేతో వెలుగులోకి రానుంది. ఎస్సారెస్పీ కెనాల్‌లో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం కేటాయించిన భూములు అక్రమార్కుల చేతుల్లో చిక్కడమే కాకుండా.. నకిలీ పట్టాలతో కొంతమంది భూ అక్రమణలకు తెగబడిన వైనం జిల్లాలో వివా దాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం భూముల రీసర్వేతో డీ–1 పట్టాల లెక్క కొలిక్కి వస్తోంది. నిజమైన నిర్వాసితులెవరూ..? అక్రమంగా చొరబడిన వారెవరూ..?స్పష్టత రానుంది.

ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో..

1963–72 సమయంలో ఎస్సారెస్పీ కెనాల్‌ నిర్మాణంలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని సుమారు 90 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది ఇళ్లు, భూములు కోల్పోయారు. వారిని నిర్వాసితులుగా గుర్తించి డీ– పట్టాలు (డిస్‌ప్లేస్‌డ్‌) అందించింది. ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు, వ్యవసాయ భూములకు పట్టాలు ఇచ్చారు. నిర్వాసితుల్లో ఎక్కువ మందికి జిల్లాలోని మల్లాపూర్‌, బుగ్గారం, ధర్మపురి, రాయికల్‌ మండలాల్లో సుమారు 18వేల ఎకరాల ప్రభుత్వ భూములు కేటాయించారు. ఇలా డీ–1 పట్టాలు పొందిన నిర్వాసితులు కొందరు భూముల వద్దే స్థిరపడ్డారు. ఆర్థికంగా ఉన్నవారు మారుమూల ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టంలేక హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ వంటి పట్టణ ప్రాంతాలకు వెళ్లారు. అయితే వారికి సంబంధించిన వందలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. వీటిపై స్థానిక నాయకులు, భూ ఆక్రమణదారుల కన్నుపడింది.

అంతా గోల్‌మాల్‌

ఎస్సారెస్పీ ముంపు ఫలితంగా కాలక్రమేణా మల్లాపూర్‌, బుగ్గారం, ధర్మపురి మండలాల్లో కొత్తగా ఏర్పాటైన గ్రామాల్లో భూముల ధరలు పెరిగాయి. దీంతో కొంతమంది నేతలు, భూ ఆక్రమణదారులు నిర్వాసితుల నుంచి డీ–1 పట్టాలు కొనుగోలు చేసే తంతుకు తెరలేపారు. పట్టాలు ఉన్నా.. తమ కబ్జాలో లేని భూములకు ఎంతిస్తే అంతే చాలు అన్న రీతిలో నిర్వాసితులు చాలామంది డీ–1 పట్టాలను అమ్ముకున్నారు. ఆ సమయంలో భూములకు రిజిస్ట్రేషన్లు కూడా చేయడం గమనార్హం. ఇదే అదనుగా ఎస్సారెస్పీ ప్రధాన కార్యాలయం నుంచి కొంతమంది బోగస్‌ డీ–1 పట్టాలు సృష్టించడం.. ఎవరికివారు నకిలీ పట్టాలు తయారు చేసుకుని భూ నిర్వాసితులకు కేటాయించిన భూముల్లో కబ్జాల్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో మల్లాపూర్‌ మండలంలో ఎస్సారెస్పీ ముంపు గ్రామాల్లో చాలాచోట్ల తీవ్ర వివాదాలు నెలకొన్నాయి.

రీసర్వేతో కలకలం

జిల్లాలో రెండు నెలలుగా భూముల రీ సర్వే కొనసాగుతోంది. ప్రధానంగా మల్లాపూర్‌ మండలంలోని ఐదు ఎస్సారెస్పీ ముంపు గ్రామాల్లో చేపడుతున్నారు. ఇందులో అక్రమంగా డీ–1 పట్టాలతో కబ్జాలోకి వచ్చిన వారి వివరాలు, నకిలీ పట్టాల దందా వెలుగులోకి రానుంది. డీ–1 పట్టాల రికార్డుల్లో లేకుండా నిర్వాసితుల నుంచి భూములు కొనుగోలు చేసి కబ్జాకు వెళ్లిన వారి లెక్క తేలనుంది. మల్లాపూర్‌ మండలంలో ఈ రీతిలో చాలామంది నేతలు డీ–1 పట్టాల ఆసరాతో భూముల్లో కబ్జాలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం రీసర్వేతో వెలుగులోకి రానుంది. రీసర్వేలో రికార్డుల ప్రకారం డీ–1 పట్టా కలిగి ఉండి క్షేత్రస్థాయిలో భూమిలో సాగు చేసుకున్న వారికి మాత్రమే భూదార్‌ నంబర్‌ కేటాయించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనుండటంతో అక్రమంగా పట్టాలు తెచ్చుకున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement