తహసీల్దార్‌ భవనాన్ని కూల్చి.. పెట్రోల్‌ బంకా..? | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ భవనాన్ని కూల్చి.. పెట్రోల్‌ బంకా..?

Sep 29 2026 12:27 AM | Updated on Sep 29 2026 12:27 AM

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని కూల్చి.. ఆ ప్రదేశంలో పెట్రోల్‌, డీజిల్‌ అవుట్‌లెట్‌ ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాతబస్టాండ్‌ వద్ద గల పోలీస్‌క్వార్టర్స్‌లో ఇంధన అవుట్‌లెట్‌ ఏర్పాటు చేస్తామని మూడేళ్ల క్రితం టెండర్లు పిలిచి మధ్యలో ఆపేశారని, తహసీల్దార్‌ భవనాన్ని కూల్చి ఆ స్థలంలో బంక్‌ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. కలెక్టర్‌, ఎస్పీ సమన్వయం చేసుకుని పోలీస్‌క్వార్టర్స్‌లో బంక్‌ ఏర్పాటు చేయాలన్నారు.

సీఎం పర్యటన కేటీఆర్‌పై ప్రభావం చూపదు

సీఎంగా ప్రజలు, రైతులు, నేత కార్మికులకు రేవంత్‌రెడ్డి చేసిందేమీలేదని, ఆయన సిరిసిల్ల పర్యటనతో కొత్తగా ఒరిగేదేమీలేదని జీవన్‌రెడ్డి అన్నారు. మహిళలు బీడీ కార్మికులుగా, వారి భర్తలు నేత కార్మికులుగా జీవిస్తున్నారని, మూడేళ్లవుతున్నా కనీసం ప్రావిడెంట్‌ ఫండ్‌, పెన్షన్‌ అందించలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేనన్ని విద్యాకేంద్రాలు సిరిసిల్లలో ఉన్నాయన్నారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, శివకేసరి, రాము, వెంకటేశ్వర్లు, గంగాధర్‌, దేవేందర్‌నాయక్‌ పాల్గొన్నారు.

హిందీ టీచర్‌ను నియమించాలి

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్‌ ప్రాంతంలోగల బాలికల హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుడు లేక సబ్జెక్ట్‌ చదువుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన రాజేశ్‌ మూడు నెలలుగా విధులకు హాజరుకావడం లేదంటున్నారు. పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు సుమారు 260 మంది చదువుకుంటున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అర్ధవార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హిందీ బోధించే ఉపాధ్యాయుడు లేకుంటే పరీక్ష ఎలా రాయాలని విద్యార్థులు అంటున్నారు. విషయాన్ని తల్లిదండ్రులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయినా స్పందన లేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి హిందీ టీచర్‌ను త్వరగా నియమించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement