జగిత్యాల: జిల్లాలోని చెరువుల హద్దులను పకడ్బందీగా గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 276 చెరువులకు డీ మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. చెరువుల హద్దులు, విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, సంబంధిత భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయనున్నారు. ప్రతి చెరువు హద్దులను పక్కాగా నిర్ధారించనున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఫిషరీస్, ఫారెస్ట్, అగ్రికల్చర్ శాఖల సమన్వయంతో సర్వే చేయనున్నారు. ఇప్పటికే అదనపు కలెక్టర్ బీఎస్.లత సంబంధిత శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి వ్యత్యాసాలకు తావు లేకుండా తుది వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. డీమార్కింగ్ పూర్తయిన తర్వాత ప్రతి చెరువుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేఎంఎల్ ఫార్మెట్‌లో సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెరువుల హద్దులు స్పష్టంగా లేకపోవడం, అక్రమాలకు గురికావడంతో డీ మార్కింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. ప్రత చెరువును క్షేత్రస్తాయిలో పరిశీలించి విస్తీర్ణం, హద్దులు భౌగోళిక అంశాలను పరిశీలించనున్నారు.
ఆక్రమణలే అధికం..
జిల్లాలో చెరువులు దాదాపు చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. ఇప్పటికే అధికారుల వద్ద చెరువులకు సంబంధించిన హద్దులు భౌగోళిక పరిస్థితులకు సంబంధించి రికార్డులున్నప్పటికీ ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవల్‌వి పరిశీలించి హద్దులు నిర్ణయించనున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న చెరువులను గుర్తించి ఫుల్ ట్యాంక్ లెవల్ హద్దులు చేపట్టనున్నారు. జిల్లాలో అత్యధిక చెరువులున్నప్పటికీ 276 చెరవులకు ప్రస్తుతం డీ మార్కింగ్ చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఫిషరిస్, ఫారెస్ట్, అగ్రికల్చర్ శాఖలు సమన్వయంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే చెరువులు అత్యధికంగా ఆక్రమణకు గురికావడం, చాలాచోట్ల బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో వెంచర్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఉన్న భూములు కబ్జాకు గురికాకూడదని ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
అక్రమాలకు చెక్...
చెరువుల హద్దులను పకడ్బందీగా గుర్తించడం ద్వారా భవిష్యత్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. తద్వారా చెరువుల పరిరక్షణకు అవకాశం ఉంటుంది. నిర్దేశించిన గడువు ప్రకారం ఈనెల 30లోపు జిల్లాలో 276 చెరువులు డీ మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
30 లోపు ప్రక్రియ పూర్తి
జిల్లాలో 276 చెరువుల హద్దులను డీ మార్కింగ్ చేయనున్నారు. ఈనెల 30 లోపు పూర్తి చేస్తాం. ఎఫ్‌టీఎల్ వరకు గుర్తించి హద్దులు నిర్ణయించి చర్యలు తీసుకుంటున్నాం. డీ మార్కింగ్ చేసిన అనంతరం కేఎంఎల్ ఫార్మెట్‌లో సిద్ధం చేస్తాం. ఇప్పటికే చెరువులకు సంబంధించి రికార్డులు అందుబాటులో ఉన్నాయి.
– బీఎస్.లత, అదనపు కలెక్టర్


