జగిత్యాలరూరల్: జిల్లాలో లేఅవుట్ లేని ప్లాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాంటి ప్లాట్లను కొనుగోలు చేసిన వారు ఇల్లు నిర్మించుకుందామని పంచాయతీ అనుమతి కోసం వెళ్తే అధికారులు నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ లేని ప్లాట్ల విక్రయాలు మాత్రం ఆపడం లేదు. రెగ్యులర్ లేఅవుట్ ఉండి.. రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్లలో మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం 2020 ఆగస్టు 31న జీవో జారీ చేసిన విషయం తెల్సిందే. జిల్లాలో ఈ నిబంధనలను రియల్ వ్యాపారులు ఉల్లంఘిస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే ప్లాట్లుగా ఏర్పాటు చేసి ప్రజలకు అంటగడుతున్నారు. లేఅవుట్ నిబంధన పాటించకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోంది. లేఅవుట్ లేకుంటే సదరు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వవద్దని డీపీవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ చాలామంది తమ రాజకీయ పలుకుబడితో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తిప్పన్నపేట గ్రామంలో సుమారు 120 ఎకరాల్లో.. మోతెలో 112, ధరూర్‌లో 315, లింగంపేటలో 110, హస్నాబాద్‌లో 45, తిమ్మాపూర్‌లో 22, నర్సింగాపూర్‌లో 50, వెల్దుర్తిలో సుమారు రెండెకరాల్లో ఎలాంటి అనుమతులూ లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు ఏర్పాటు చేశారు. మెట్‌పల్లి, కోరుట్ల పట్టణ శివారు ప్రాంతాలతోపాటు మల్యాల మండలం ముత్యంపేట, రాజారం, కొడిమ్యాల మండలం పూడూరు, నాచుపల్లి, జగిత్యాల మండలం అంబారిపేటలో లేఅవుట్ లేకుండానే ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆందోళన చెందుతున్న విక్రయదారులు
లేఅవుట్ నిబంధన ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు మాత్రమే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలున్నా జోరుగా ప్లాటింగ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలుదారులకు మ్యాప్‌లు వేసి రహదారులున్నట్లు చూపిస్తూ నమ్మిస్తున్నారు. తీరా ప్లాట్లు కొనుగోలు అనంతరం రహదారులు వెడల్పుగా లేక ఇబ్బంది పడుతున్నారు.
చర్యలు చేపడతాం
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్ చేసి ప్లాట్లు పెడితే నిర్మాణాలకు అనుమతి ఇవ్వవద్దని గ్రామపంచాయతీలకు సూచించాం. అక్రమ లేవుట్లు ఉన్న ప్లాట్లలో పంచాయతీలు నిర్మాణాల కోసం అనుమతి ఇవ్వడం లేదు. లేఅవుట్ నిబంధనలు ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే అనుమతి ఇస్తాం.
– మదన్‌మోహన్,
జిల్లా పంచాయతీ అధికారి, జగిత్యాల


