జగిత్యాలజోన్: న్యాయసేవలను విస్త్రృతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శిగా నియమితులైన ఎం.సరితకు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయ సేవా సంస్థ కార్యకాలాపాలను మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లాలని, ప్రజలకు హక్కులతోపాటు విధులు వివరించాలని సూచించారు. సరిత మాట్లాడుతూ కక్షిదారులకు ఉచిత న్యాయసహాయం అందించడంతోపాటు, ప్రజలు మోసాలకు గురికాకుండా చట్టాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, సబ్ జడ్జి నాగేశ్వర్‌రావు, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, న్యాయవాదులు పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరే లక్ష్యం
జగిత్యాలరూరల్: వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో కొత్త 5ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బుధవారం ప్రారంభించారు. లోవోల్టేజీ, సాంకేతిక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, 24 గంటల సరఫరా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్టార్టర్లు, మోటార్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డీఈ గంగారాం, శ్రీనివాస్, డివిజనల్ ఇంజినీర్ ఎంఆర్‌టీ సింధూశర్మ, ఏడీఈ ప్రదీప్, శ్రీనివాస్, ఏఈ రహీం, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
44.937 టీఎంసీలకు ఎస్సారెస్పీ నీటిసామర్థ్యం
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మరోవైపు 933 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు 1080, నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 44.937 టీఎంసీలుగా ఉంది.
భూ రీసర్వే నిలిపివేయాలంటూ ఆందోళన
మెట్‌పల్లి: మల్లాపూర్ మండలంలోని నడికుడ, రాఘవపేట గ్రామాల మధ్య చేపడుతున్న భూ రీసర్వేను నిలిపివేయాలంటూ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం రెండు గ్రామాల వీడీసీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ రెండు గ్రామాల మధ్య ఉన్న గుడ్డనుగుల గుట్ట ప్రాంతంలోని రెవెన్యూ భూమిని ఏళ్ల నుంచి పశువుల మేతకు వినియోగించుకుంటున్నామని, నడకుడకు చెందిన ఓ వ్యక్తి ఇ టీవల ఆ భూమి తనదని చెబుతూ అందులో పంట సాగు చేస్తున్నాడని తెలిపారు. విషయాన్ని కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లి భూమికి ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని కోరామని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా ఆర్డీవో, తహసీల్దార్లు ఆ భూమిలో సర్వే చేపట్టడం సరికాదన్నారు. వెంటనే సర్వేను నిలిపివేసి పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.


