ఏటా రూ.900 చెల్లించాలని నోటీసులు లబోదిబోమంటున్న కాలనీలవాసులు రాయికల్ బల్దియాలో వింత పరిస్థితి
పట్టణంలో సుమారు 20వేల జనాభా ఉంది. 12 వార్డులు, 4500 వరకు ఇళ్లు ఉన్నాయి. బల్దియాలో ఆరేళ్లుగా మిషన్ భగీరథ, అమృత్ 2.0 పనుల నిమిత్తం గతంలో గ్రామపంచాయతీలో ఉన్న నల్లాలు తొలగించారు. ఉన్న నల్లాలు తొలగించడంతో చాలామంది నిరుపేదలు తాగునీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటినుంచి వారికి కొత్త కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. మరోవైపు నెలకు రూ.75 చొప్పున ఏడాదికి రూ.900 చెల్లించాంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తుండడం గమనార్హం. మున్సిపల్ నీరు నల్లాద్వారా రాకున్నా ఏడాదికి రూ.900 ఎందుకు చెల్లించాలంటూ బల్దియా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్షేత్రస్థాయిలో నీటి సరఫరా ఉన్న వాటికే బిల్లులు వసూలు చేయడంతో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. ప్రస్తుతం నీటి కనెక్షన్ల వివరాలు ఆన్‌లైన్ చేయడంతో నల్లా నీరు రాకున్నా బిల్లులు మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కూడా వారికి నల్లా కనెక్షన్లు లేకున్నా నల్లా బిల్లులు మాత్రం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
బల్దియా ప్రజలకు అందని రక్షిత మంచినీరు
పట్టణ ప్రజల తాగునీటి కోసం గతంలో మిషన్ భగీరథ పథకం కింద రూ.6 కోట్లు వెచ్చించి నీరు అందించాలని నిర్ణయించారు. అయినప్పటికీ కొన్ని వార్డుల్లో కొన్ని గృహాలకు చుక్క నీరు అందలేదు. అమృత్ 2.0 పథకం కింద రూ.15.20 కోట్లు మంజూరు కాగా.. ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు దరి చేరడం లేదు. మున్సిపల్ అధికారులు స్పందించి వార్డుల్లో పైప్‌లైన్లను త్వరితగతిన వేయడంతోపాటు, నల్లా కనెక్షన్ బిగించి తాగునీటి సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
ఆరేళ్లుగా కనెక్షనే లేదు
ఆరేళ్లుగా నా ఇంటికి నల్లా కనెక్షనే లేదు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం నల్లా బిల్లు వేస్తున్నారు. ఇటీవల ఆన్‌లైన్‌లో చూడటంతో
నెలకు రూ.75 చొప్పున బిల్లు కనిపించడంతో అవాక్కయ్యాను. మున్సిపల్ అధికారులు నల్లా కనెక్షన్ లేని వారికి బిల్లు మాఫీ చేయాలి.
– పుర్రె రమేశ్ 11వ వార్డు
నల్లాలు లేకుంటే బిల్లు బంద్
బల్దియాలో నల్లాలు లే కుంటే ఆన్‌లైన్‌లో వచ్చే బిల్లులు వసూలు చేయబోం. అలాంటి వారికి మాఫీ చేస్తాం. దీనిపై పట్టణ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నల్లా కనెక్షన్ లేనివారికి బిల్లు నుంచి మినహా యింపు ఇస్తాం.
– మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్
రాయికల్: రాయికల్ బల్దియాలో నల్లాలు లేకున్నా ఏడాదికి రూ.900 పట్టణ ప్రజలు చెల్లించాల్సి న పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో 3400 నల్లా కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం వెయ్యి కూడా లేవు. అయినప్పటికీ ఇల్లు ఉన్న ప్రతిఒక్కరూ నల్లాపన్ను మాత్రం
చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది.
రాయికల్ మున్సిపాలిటీ స్వరూపం
వార్డులు 12
గృహాలు 4500
ఉన్న నల్లాలు 1000
అధికారికంగా మాత్రం 3400
నీటి పన్ను నెలకు రూ.75
ఏడాదికి రూ.900


