జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్ ఫ్లో వస్తోంది. బుధవారం సాయంత్రం వరకు 3500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అవుట్ ఫ్లోగా 751 క్యూసెక్కులుగా ఉంది. గతేడాది జూలై 29 నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 1075 అడుగులు, 32.897 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 1065 అడుగులు, 16.545 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నిండే అవకాశం ఉందని, ఏ క్షణమైనా గేట్లు ఎత్తి గోదావరిలోకి వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఇంజినీర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు నది వైపు రావద్దని సూచించారు.
ధర్మపురి వద్ద పెరుగుతున్న గోదావరి మట్టం
ధర్మపురి: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి సిబ్బందితో కలిసి పరిశీలించారు. పశువుల కాపరులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సీఐ రాంనర్సింహారెడ్డి సూచించారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు లోనికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కోరుట్లలో లోతట్టు ప్రాంతాలు జలమయం
కోరుట్ల/కోరుట్ల రూరల్: కోరుట్ల పట్టణంతోపాటు వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలూ పొంగి ప్రవహించాయి. ముత్యాలవాడ, ప్రకాశం రోడ్, రథాల పంపు ఏరియాలు వాగును తలపించాయి. పెద్దవాగు ప్రవాహాన్ని మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ పరిశీలించారు.
డిజిటలైజేషన్ 88.43శాతం పూర్తి
జగిత్యాల: ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ జిల్లాలో 88.43 శాతం పూర్తయిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేశామని, లోపాలను వెంటనే సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 87.74 శాతం, జగిత్యాలలో 85.63శాతం, ధర్మపురిలో 92.06 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
జాతీయ పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ
రాయికల్: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చెరుకు మహేశ్వరశర్మ ఢిల్లీలో జాతీయ విశేష పురస్కారాన్ని బుధవారం కేంద్రమంత్రి భూపతిరాజ్, శ్రీనివాస్‌వర్మ, రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ చేతులమీదుగా అందుకున్నారు. సాహిత్యంలో ఆయన సేవలకు గుర్తింపు లభించింది. మహేశ్వర శర్మను ఉపాధ్యాయులు అభినందించారు.


