ఇక ప్రచారపర్వం.. | - | Sakshi
Sakshi News home page

ఇక ప్రచారపర్వం..

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

ఇక ప్రచారపర్వం..

ఇక ప్రచారపర్వం..

ముగిసిన నామినేషన్ల పరిశీలన

బీఫామ్‌లు దక్కేది ఎవరికో..?

నాయకుల వద్ద ఆశావహుల బారులు

జగిత్యాల: నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారరంగంలోకి దూకారు. ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. సీటు ఆశిస్తున్న వారు ప్రధాన నాయకుల వద్దకు బారులు తీరుతున్నారు. బీఫామ్‌లు లేకుండానే నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. వాటిని సమర్పించేందుకు ఇంకా అవకాశం ఉండటంతో టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకవేళ టికెట్‌ రాని పక్షంలో ఇండిపెంట్లుగా బరిలో దిగుదామా..? లేదా వేరే పార్టీలోకి మారి బీఫామ్‌ తెచ్చుకుందామా..? అని సందిగ్ధంలో ఉన్నారు.

టికెట్‌ రాకుంటే..

ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నారు. ఒక్కోవార్డు నుంచి దాదాపు ముగ్గురు, నలుగురు నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరిని టికెట్‌ వరిస్తుందో తెలియని పరిస్థితి. ఒకవేళ టికెట్‌ దక్కకుంటే మరో పార్టీకి వెళ్తే ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సహకరిస్తారా..? ఓడిపోతే ఎలా..? ఖర్చు తడిసి మోపెడవుతుందని కూడా ఆందోళన చెందుతున్నారు. కొందరు ఎలాగైనా కౌన్సిలర్‌ పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు. పోటీ ఉన్నచోట ప్రధాన పార్టీల ఆశావహులు మరో అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. ప్రధానపార్టీల నాయకులు గెలుపుగుర్రాల కోసం సర్వే చేయించి ఇప్పటికే జాబితా రూపొందించారు. వారికే టికెట్లు ఇచ్చేలా చూస్తున్నారు. ఒక్కోవార్డు నుంచి దాదాపు నలుగురైదుగురు పోటీలో ఉండటంతో రెబల్స్‌ బెడద కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రెబల్స్‌ను బుజ్జగించుకుంటూనే గెలుపుగుర్రాలకు టికెట్లు ఇవ్వాలని ఆశిస్తున్నారు.

జగిత్యాల.. కొలిక్కి వచ్చేనా..?

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా ప్రధానంగా జగిత్యాల, రాయికల్‌దే సమస్యగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ వైపు చేరారు. ఈ క్రమంలో తాను సూచించిన అభ్యర్థులకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి మాత్రం మొదటి నుంచి జెండా మోసి పార్టీ కోసం కష్టపడిన నాయకులకే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కనీసం పార్టీ సభ్యత్వం కూడా తీసుకోని వ్యక్తులకు టికెట్లు ఎలా ఇస్తారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి విషయంలో అన్ని పార్టీల్లో ప్రధాన నాయకులు ఉండటం, వారు బీఫాంలు కేటాయించడంలో అక్కడ ఇబ్బంది లేకుండా ఉంది. ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్‌ వైపు ఉండటం, ఒకవైపు కష్టపడిన వారికే ఇవ్వాలని జీవన్‌రెడ్డి, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తన వర్గానికే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది ప్రధాన నాయకులకే తలనొప్పిగా మారింది. ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుఫున పోటీచేసే ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కోవార్డు నుంచి ముగ్గురునలుగురు టికెట్ల కోసం పట్టుబట్టుతుండడంతో ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే బీఫాంలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రచారమే..

సమయం ఆశించినంతగా లేకపోవడంతో అభ్యర్తులు ప్రచారపర్వంలో మునిగిపోయారు. తమకే ఓటు వేయాలని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. వ్యక్తిగానే ప్రచారం చేసుకుంటూ గుర్తులు వచ్చాక చెబుతామని, తమ్మను గుర్తుపెట్టుకోవాలని ఓటర్లను కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement