పన్నుల వసూలు రూ.కోటి
కోరుట్ల: ఎన్నికల సంగతేమోగానీ.. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మొండి బకాయిలు దండిగా వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతోపాటు ప్రతిపాదకులు కూడా ఆస్తి పన్ను, నల్లా బిల్లులు చెల్లించాలన్న నిబంధన మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదాయం భారీగా సమకూరింది.
అభ్యర్థులు.. ప్రతిపాదకులు
జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో ఎక్కువమొత్తంలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జగిత్యాలలో 50వార్డులు, కోరుట్లలో 33, మెట్‌పల్లిలో 26 వార్డులకు పెద్ద మొత్తంలో నామినేషన్లు వచ్చాయి. ఈ మూడు మున్సిపాలిటీల్లో బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు ప్రతిపాదకులు ఆస్తిపన్ను, నల్లా బిల్లుల చెల్లించారు.
రూ.కోటి వసూలు
జగిత్యాల మున్సిపాలిటీలో సుమారు రూ.35,45,000, కోరుట్లలో రూ.33,80,000, మెట్‌పల్లిలో రూ.19,54,000, రాయికల్‌లో రూ.7,18,000, ధర్మపురిలో రూ.5,10,000 మేర పన్నులు వసూలయ్యాయి. ఈ మొత్తం దాదాపు రూ.కోటి మేర పన్నులు వసూలు కావడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో వసూలైన పన్నుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులే అధికంగా ఉండటం విశేషం.
పన్నుల వసూలు రూ.కోటి


