రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా..?
మల్లాపూర్: రైతుల గోడు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కోతదశలో మొక్కజొన్న పంట దెబ్బతిందని, దిగుబడి రాక రైతులు ఆవేదన చెందారని, ఇప్పుడు అమ్ముకుందామంటే అరిగోస పడాల్సి వస్తోందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10కేంద్రాలనే ఏర్పాటు చేయడంతో రైతులు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేకనే ఈ దుస్థితి దాపురించిందన్నారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్, నాయకులు దేవ మల్లయ్య, బండి లింగస్వామి, మొరపు గంగరాజం, ఏనుగు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


