జగిత్యాల: జిల్లాలో చిన్ననీటి వనరుల గణనకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో ఇప్పటికే 7వ చిన్న నీటి వనరుల గణనపై సమావేశం నిర్వహించిన సూచనలు కూడా చేశారు. చీఫ్ ఇంజినీరింగ్ ముఖ్య ప్రణాళిక అధికారి గుగ్గిళ్ల సత్యం ఆధ్వర్యంలో గణన చేపడుతున్నారు. 2 వేల హెక్టార్లలోపు, 4,942 ఎకరాల్లోపు ఆయకట్టులో ఉన్న వనరులను లెక్కించనున్నారు. మొదటి గణన 1986–87లో చేశారు. ప్రతి ఐదేళ్లకోమారు సర్వే చేపడుతుంటారు. ప్రస్తుతం 7వ జాతీయ జలవనరుల గణనను చేపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేపట్టడానికి ఎన్యుమరేటర్లను నియమించారు.
తేలనున్న చిన్ననీటి వనరుల లెక్క
సర్వే ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, బోరుబావుల లెక్క తేలనుంది. జిల్లాలోని 20 మండలాల్లో 382 గ్రామపంచాయతీల్లో ఉన్న చిన్ననీటి వనరుల గణన చేపట్టనున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి వనరుల మరమ్మతుకు నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది.
అధికారులకు శిక్షణ
చీఫ్ ప్లానింగ్ అధికారి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఎన్యుమరేటర్లకు శిక్షణ కల్పిస్తున్నారు. వీరు బోరుబావులు, చెరువులు, ఓపెన్ బావులు, 2 వేల హెక్టార్లలోపు భూమికి సాగునీరు అందించే వాటిని లెక్కించనున్నారు. వీటన్నింటిని ఓ యాప్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే ఈ యాప్‌పై సిబ్బందికి శిక్షణ కల్పిస్తున్నారు. అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో చీఫ్ ప్లానింగ్ అధికారి, జీపీవోలు, ఏఈవోలు, ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి ఈ ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో 51,936 వ్యవసాయ బావులు
గతంలో లెక్కల ప్రకారం జిల్లాలో 51,936 చిన్ననీటి వనరులు, వ్యవసాయ బావులున్నాయి. ప్రస్తుతం వీటిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. లోతైన బావులు 4,256, బావుల్లో వేసిన బోర్లు 140, వ్యవసాయ బావులు 23,278 ఉన్నాయి.
సిబ్బందికి శిక్షణ ప్రారంభం
మూడు నెలల్లో పూర్తి
తేలనున్న బోర్లు, బావులు, చెరువులు, కుంటల లెక్క
ప్రత్యేక యాప్‌లో నమోదు
గ్రామపంచాయతీలు 382
వ్యవసాయ బావులు 51,936
లోతైన బావులు 4,256
బావుల్లో ఉన్న బోర్లు 140
డిజిటల్ పద్ధతిలో లెక్కింపు
ఏడో చిన్ననీటి తరహా సాగునీటి వనరుల గణన రెండో జలాశయాల గణన స్మార్ట్‌ఫోన్‌లోనే యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడతాయి. డేటా ఎంట్రీ, స్క్రూటిని తదితర ప్రక్రియలు మొబైల్ యాప్ ద్వారానే నిర్వహణ ఉంటుంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చాం.
– సత్యం, చీఫ్ ప్లానింగ్ అధికారి


