పాఠశాలల్లో అందని డిజిటల్ విద్య
గొల్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు ప్రభుత్వం నిధులు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నా.. వైఫై కనెక్షన్ లేక లక్ష్యం నీరుగారిపోతోంది. దాదాపు ఏడాదికాలంగా వైఫై సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయులు తమ సెల్‌ఫోన్ల డేటాను వినియోగించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. గొల్లపల్లి మండలంలోని వెన్గుమట్ల, రంగధామునిపల్లి, అగ్గిమల్ల, రాఘవపట్నం తదతర పాఠశాలల్లో డిజిటల్ ప్యానెల్ బోర్డులు, టీవీలతో కూడిన సామగ్రిని సరఫరా చేసింది. ప్యానెల్ బోర్డులన్నీ ఇంటర్నెట్ ఆధారిత విద్యాబోధన కోసమే అయినా వీటికి వైఫై కనెక్షన్‌ను కల్పించలేదు.
ఉపాధ్యాయుల పైనే భారం
వైఫై సౌకర్యం లేక 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సెల్‌ఫోన్ల ద్వారా నెట్‌వర్క్ కనెక్ట్ (హాట్‌స్పాట్) చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ నెట్‌వర్క్ మధ్యలో నిలిచిపోవడం.. లేదా డేటా అయిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల డిజిటల్ తరగతులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇది బోధన నాణ్యతపై.. ఉపాధ్యాయులపై ఆర్థిక భారం కూడా మోపుతోంది. ప్రభుత్వం తక్షణం స్పందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
కనిపించని ఉన్నతాధికారుల తనిఖీ
పాఠశాలల్లో లక్షలు వెచ్చించి సమకూర్చిన డిజిటల్ సామగ్రి సరిగా పనిచేస్తోందా..? లేదా..? అనే అంశాలను తెలుసుకునేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ.. అవి పూర్తిగా కరువయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలకోసారైనా పాఠశాలలను తనిఖీ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చి, సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటల్ తరగతులకు వైఫై సౌకర్యాన్ని కల్పించాలని ప్రజలు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వైఫై సౌకర్యం లేక మొబైల్ నెట్‌వర్క్‌తో బోధన
డేటా సరిపోక తరగతులకు ఆటంకం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం


