
పొంగిపొర్లిన వాగులు, వంకలు
జగిత్యాలరూరల్/రాయికల్/సారంగాపూర్/కథలాపూర్/కోరుట్ల/కోరుట్లరూరల్: జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జగిత్యాలరూరల్, అర్బన్ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు దూకుతున్నాయి. అనంతారం రోడ్డ్యాంపై నుంచి నీరు ప్రవహించడంతో నాలుగు గంటల పాటు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, ఎస్బీ సీఐ అరీఫ్, సీఐ కరుణాకర్, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, రూరల్ ఎస్సై సదాకర్, రూరల్ తహసీల్దార్ అరుణ్‌కుమార్ వరద ప్రవాహాన్ని పరిశీలించారు. సాయంత్రానికి ప్రవాహం తగ్గడంతో రాకపోకలను పునరుద్ధరించారు. రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద గోదావరి పుష్కరఘాట్ల వరకు చేరింది. అలాగే మూటపల్లి, కిష్టింపేట, సింగరావుపేట, ఇటిక్యాల, కల్వర్టులపై నీరు ఉధృతంగా ప్రవహించింది. ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఎస్సైలు సుధీర్‌రావు, కమిషనర్ మనోహర్‌గౌడ్ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. బీర్‌పూర్ మండలం కమ్మునూర్ వద్ద గోదావరి 50 మీటర్ల ఎత్తులో ప్రవహించింది. శివాలయాన్ని చుట్టుముట్టింది. తహసీల్దార్ సుజా త, ఎస్సై రాజు, ఎంపీడీవో భీమేశ్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సారంగాపూర్ అటవీప్రాంతంలోని బతుకమ్మ కుంట మత్తడి తెగిపోయింది. రేచపల్లి–మ్యాడారంతండా గ్రామాల మధ్య లోలెవల్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పెంబట్లలో వరద పొలాలను ముంచెత్తింది. రోల్లవాగు ప్రాజెక్టు దిగువన ప్రధాన కాలువకు బుంగ పడింది. ఈఈ చక్రూనాయక్ ఆధ్వర్యంలో జేసీబీ సహయంతో బుంగను పూడ్చారు. తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపీడీవో గంగాధర్, ఆర్‌ఐ వెంకటేశ్ ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు పరిస్థితిని వివరిస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత గ్రామాల్లో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కథలాపూర్ మండలం భూషణరావుపేట శివారు రాళ్లవాగు కుడికాలువకు గండి పడి నీరంతా వృథాగా పోతోంది. ఇటీవలే నక్కల ఒర్రె వద్ద ప్రాజెక్టు కుడికాలువ నీరు వెళ్లేలా రూ.20 లక్షలతో సైఫన్ నిర్మించారు. ఆ వంతెన పక్కనే గండిపడింది. కోరుట్ల మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పూల్‌వాగు ఉప్పొంగింది. చిన్నమెట్‌పల్లి ఎల్లమ్మ చెరువు నిండి మత్తడి దూకింది. చిన్నమెట్‌పల్లి–మాదాపూర్ గ్రామాల మధ్య ఒర్రె ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. టీచర్స్ క్లబ్, యెఖీన్‌పూర్, కాల్వగడ్డ ప్రాంతాల్లో శిథిలావస్థ ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవర సరిస్థితుల్లో కంట్రోల్ రూం నంబర్ 91000 39255కు ఫోన్ చేయాలని కమిషనర్ తెలిపారు.