
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి పాల్త్య కల్యాణి పురిటినొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు గురువారం రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. అయితే మండలంలోని భూపతిపూర్, రామాజీపేట గ్రామాల మధ్యనున్న కల్వర్టు పైనుంచి వరద పొంగిపొర్లుతుండటం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గర్భిణి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక యువత.. ఎంపీడీవో చిరంజీవి, రామాజీపేట కార్యదర్శి మహేశ్, కానిస్టేబుల్ తిరుపతి సహకారంతో కల్యాణి, ఆమె కుటుంబసభ్యులను జేసీబీలో కూర్చోబెట్టుకొని కల్వర్టు దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో రాయికల్ ఆస్పత్రికి తరలించారు.
కొట్టుకుపోయిన వంతెన.. గర్భిణిని స్ట్రెచర్ ద్వారా దాటించిన ఎన్‌డీఆర్‌ఎఫ్
హవేలీ ఘనపూర్ (మెదక్): మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని రాజ్‌పేట తండాకు చెందిన మాలోత్ హరిత పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తరలించేందుకు తండా నుంచి బూర్గుపల్లి వరకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అయితే భారీ వర్షాలకు బూర్గుపల్లి వద్ద వంతెన కొట్టుకుపోవడంతో అక్కడే ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది స్ట్రెచర్ సాయంతో ఆమెను వంతెన దాటించి 108 అంబులెన్సులో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.