
పదిహేడేళ్లకు రాజీ
జగిత్యాలక్రైం: జాతీయ న్యాయ సేవ అధికారిక సంస్థ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సీనియర్ సివిల్‌జడ్జి లోక్ అదాలత్ ద్వారా 17 ఏళ్ల కేసుకు రాజీ కుదిర్చారు. ఈ కేసులో రాజీకి సహకరించిన వాదిప్రతివాదులు మారిశెట్టి ప్రతాప్, మెట్ట మహేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములును సీనియర్ సివిల్ జడ్జి న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ శ్రీవెంకటమల్లిక్‌శర్మ, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి రత్నపద్మావతి అభినందించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జడ్జి నారాయణ, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా వందలాది కేసుల పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
జగిత్యాలక్రైం: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ రఘుచందర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో వినాయక ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వినాయక మండప నిర్వాహకులు విగ్రహాల ప్రతిష్ఠతో పాటు నిమజ్జనం వరకు ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. డీజే సౌండ్స్, శబ్ద కాలుష్యం వచ్చే వాటిని వినియోగించవద్దన్నారు. నిర్వాహకులు పోలీసు వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చాలని, వాట్సప్, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. సీఐ కరుణాకర్, ఎస్సైలు సుప్రియ, కుమారస్వామి, రవికిరణ్, మల్లేశ్ పాల్గొన్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదు
జగిత్యాలరూరల్: పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎలాంటి కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. జిల్లాలో శుక్రవారం వరకు 5,53,890 యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 13,703 బస్తాల యూరియా నిల్వ ఉందని, పంపిణీపై కొందరు కావాలనే కొరత ఉందని అపోహలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియా అన్ని మండలాల్లో అందుబాటులో ఉందన్నారు. 2–3 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఉపాధి పనుల జాతర
కోరుట్లరూరల్: మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈజీఎస్ పనుల వివరాలను గ్రామస్తులకు వివరించారు. పైడిమడుగులో రైతు జగత్‌రెడ్డి ఈజీఎస్ నిధులు రూ.3 లక్షలతో నిర్మించిన పౌల్ట్రీఫామ్‌ను జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. మండలంలో 2025–26 సంవత్సరానికి ఈజీఎస్ నిధులు రూ.1.34 కోట్లతో 210 పనులు నిర్వహిస్తామని ఎంపీడీవో రామకృష్ణ పేర్కొన్నారు. బాగా పనిచేసిన పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, హరిత సంరక్షకులను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీవో మమత, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

పదిహేడేళ్లకు రాజీ

పదిహేడేళ్లకు రాజీ