
పరిశుభ్రత ఎలా?
కోరుట్ల: ‘రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పాఠశాల తరగతి గదులతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు’. అక్కడున్న వారంతా.. ఒకే సర్ అని తలలు ఊపారు.. ఇదంతా బాగానే కానీ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్న స్కావెంజర్లకు దాదాపు ఆరునెలలుగా వేతనాలు లేవు. అడపదడప వేతనాలు ఇస్తున్నా..అవి అరకొరగానే ఉండటంతో స్కావెంజర్లు ఆసక్తిగా పనిచేయడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
జిల్లాలో విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తం 270 వరకు ఉన్నాయి. వీటిలో టాయ్‌లెట్స్, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతీ పాఠశాలకు ఒక స్కావెంజర్‌ను నియమించుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి స్కావెంజర్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడి పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నా.. కేవలం ఒక్క స్కావెంజర్‌ను మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు దాదాపుగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ల నియామకం జరిగింది. ఇక్కడితో సమస్య సమసిపోతుందని భావించినా గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చే అరకొర వేతనాలు సైతం ఇవ్వడం లేదు. ‘ఇదిగో వేతనాలు వస్తున్నాయి..అదిగో వస్తున్నాయి’.. అంటూ ఊరించడమే తప్ప ఇప్పటికీ వేతనాలు ఇవ్వలేదు.
స్కావెంజర్ల వేతనాల విషయంలో జిల్లాతో పోలిస్తే ఇతర జిల్లాలో ఎక్కువ మొత్తంలో వేతనాలు అందుతున్నట్లు సమాచారం. పొరుగు జిల్లాలో స్కావేంజర్లకు నెల రూ. 6వేలు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనంగా స్కావెంజర్ల నియామకానికి అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో మాత్రం స్కావెంజర్లకు కేవలం రూ.3వేలు వేతనం ఇవ్వడం..ఆ వేతనం సకాలంలో ఇవ్వకపోవడం సమస్యగా మారింది. వేతనాలు సరిగా రాకపోవడంతో స్కావెంజర్లు సరిగా పనులకు రావడం లేదు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తే..‘అరకొర వేతనాలు..అవీ సరిగా రావడం లేదు.. కానీ ఎక్కడా లేని ఆజమాయిషి’ ఎందుకని వర్కర్లు అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో పరిశుభ్రతను ఎలా మెయింటేన్ చేయాలో తెలియక నిర్వాహకులు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. పాఠశాల విద్యకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా కలెక్టర్ ఈ మధ్య కాలంలో తరచూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడంతో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏలాంటి చర్యలు ఉంటాయోనని ఉపాధ్యాయులు బెదిరిపోతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాలల పరిశుభ్రతకు అవసరమైన వనరులు కల్పించి ఫలితం ఆశిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
● జాడలేని స్కావెంజర్లు
● అరకొర వేతనాలు.. అవీ సరిగా ఇవ్వరు..