
దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
జగిత్యాలక్రైం: పలు దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శనివారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిందితులను అరెస్ట్ చూపారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండంపల్లికి చెందిన వనం పాపయ్య, జగిత్యాల శివారు టీఆర్‌నగర్‌కు చెందిన వనం పాపయ్య, వనం రాము, దాసరి రవి, బాన్సువాడకు చెందిన జగన్నాథం కృష్ణ ముఠాగా ఏర్పడి కొద్దికాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జగిత్యాల, రాయికల్, మల్యాల, భూపాలపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనాలు చేశారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్‌రావు రాయికల్ శివారులోని లలితామాత దేవాలయం వద్ద శనివారం తనిఖీలు చేస్తుండగా.. సమీపంలోని మామిడితోటలో నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనాలు ఒప్పుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, రూ.15 వేలు, మూడు సెల్‌ఫోన్లు, నిందితులు ఉపయోగించిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వనం పాపయ్య, వనం రాము, దాసరి రవిని రిమాండ్‌కు తరలించారు. జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నాడు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన రూరల్ సీఐ సుధాకర్, ఎస్సైలు సుధీర్‌రావు, సదాకర్, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్, సుమన్‌ను అభినందించారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
పరారీలో ఒకరు
12 తులాల బంగారం, కారు, రూ.15వేలు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం
డీఎస్పీ రఘుచందర్ వెల్లడి